అంగన్ వాడీ కార్యకర్తలు అనేక నెలలుగా చేస్తున్న పోరాటాలు ఫలించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న వారితో ప్రగతి భవన్ లో సమావేశమయి చర్చించిన తరువాత వారి జీతాల పెంచడానికి అంగీకరించారు. ప్రస్తుతం వారికి నెలకు రూ.7,000 చెల్లిస్తోంది. దానిని రూ.10,500 కు పెంచడానికి ముఖ్యమంత్రి అంగీకరించారు. అలాగే మినీ అంగన్ వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తలు, సహాయకుల జీతాలను నెలకు రూ.1,500 పెంచడానికి అంగీకరించారు. ప్రస్తుతం వారికి నెలకు రూ.4,500 చెల్లిస్తోంది. ఇక నుంచి అంగన్ వాడీ కార్యకర్తలను అంగన్ వాడీ టీచర్లుగా ప్రభుత్వం గుర్తించనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 35,700 అంగన్ వాడీ కేంద్రాలు వాటిలో 67,411 మంది అంగన్ వాడీ కార్యకర్తలు పనిచేస్తున్నారు. ఈ జీతాల పెంపుతో వారందరికీ ప్రయోజనం కలుగుతుంది.
గ్రామీణ విద్యా, వైద్యం, మాతాశిశు ఆరోగ్య రక్షణ, వారికి పౌష్టికాహార సరఫరా వంటి ప్రభుత్వం చేపట్టే అనేక కార్యక్రమాలలో అంగన్ వాడీ కార్యకర్తలే చాలా కీలకపాత్ర పోషిస్తుంటారు. కనుక ఒక విధంగా వారు గ్రామాలలో ప్రభుత్వ ప్రతినిధులు వంటివారని చెప్పవచ్చు. ఇంత క్రియాశీలమైన పాత్ర పోషిస్తున్న వారు చాలా దయనీయమైన జీవితాలు గడుపుతున్నారు. అందుకే కొద్దిగా తమ జీతాలు పెంచమని కోరారు. కానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సిఐటియు తో కలిసి ఉద్యమించక తప్పలేదు. చివరికి వారి పోరాటాలు ఫలించి ప్రభుత్వం దిగివచ్చి వారి జీతాలు పెంచింది. మంత్రులు, ప్రజా ప్రతినిధుల జీతాలు ఒకేసారి రెట్టింపు చేసుకోవడానికి ఏమాత్రం సంకోచించని తెరాస సర్కార్ అంగన్ వాడీ కార్యకర్తలకు, వీఆర్ఏలు, వివిధ ప్రభుత్వ శాఖలలో కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు పెంచడానికి మాత్రం చాలా సంకోచిస్తుంటుంది. అప్పుడు వారు అయిష్టంగానే ప్రభుత్వంతో పోరాడి ఈవిధంగా సాధించుకోవలసి వస్తుంటుంది.