అదేమీ తప్పు కాదు: బాల్క సుమన్

తెరాస యువ ఎంపి బాల్క సుమన్ నిన్న ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో ఫిరాయింపులను ప్రోత్సహించడం తప్పు కాదని సమర్ధించుకొన్నారు. “తెరాస ఒక రాజకీయ పార్టీ. అది బలంగా నిలద్రొక్కుకోవాలంటే ప్రతిపక్ష పార్టీలను బలహీనపరచడం కూడా చాలా అవసరమే. అందుకే వారి ఎమ్మెల్యేలను తెరాసలో చేర్చుకొంటున్నాము,” అని చెప్పారు. 

“అది అనైతికం..అప్రజాస్వామికం కాదా?” అనే ప్రశ్నకు సమాధానమిస్తూ “అది బంగారి తెలంగాణా సాధన కోసం జరుగుతున్న రాజకీయ శక్తుల పునరేకీకరణ. మా ప్రభుత్వం బలంగా ఉన్నప్పుడే అది సాధ్యం అవుతుంది కనుక మా ఆశయ సాధనలో కలిసి వచ్చేవారినందరినీ కలుపుకొని ముందుకు సాగిపోతున్నాము,” అని బాల్క సుమన్ చెప్పారు.

“తెరాస ప్రభుత్వానికి సరిపడినంత మెజార్టీ ఉన్నప్పటికీ ఇంకా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తెరాసలోకి ఫిరాయింపజేయడానికి కారణం తెరాస ఎమ్మెల్యేలపై నమ్మకం లేకనేనా?” అనే ప్రశ్నకు జవాబిస్తూ “తెరాసకున్న ఎమ్మెల్యేలు అందరూ పార్టీకి విధేయులే. కానీ మా ప్రభుత్వం ఇంకా బలంగా ఉండాలనే ఉదేశ్యంతోనే ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను తెరాసలో చేర్చుకొంటున్నాము,” అని చెప్పారు.

“తెలంగాణా ఉద్యమాన్ని అవహేళన చేసినవారు, ఉద్యమాన్ని, ఉద్యమకారులను దెబ్బ తీయాలని ప్రయత్నించినవారు, ఒకప్పుడు కేసీఆర్ ను చాలా తీవ్రంగా విమర్శించిన వారికి మంత్రిపదవులు కట్టబెట్టడం సమజసమేనా?”  అనే ప్రశ్నకు “తెరాస ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ. కనుక రాజకీయంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. అది పార్టీ, ప్రభుత్వ శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని తీసుకొన్నవే తప్ప వేరేగా చూడటం సబబు కాదు. మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న ప్రొఫెసర్ కోదండరామ్ వెనుక కూడా కాంగ్రెస్, తెదేపాలకు చెందిన ఉద్యమ ద్రోహులున్నారనే సంగతి అందరికీ తెలుసు,” అని అన్నారు బాల్క సుమన్ అన్నారు.