తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మద్య నెలకొన్న వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటు చేసుకొన్న ఇరు రాష్ట్రాల మంత్రుల కమిటీలు ఆదివారం రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ సమక్షంలో సమావేశం కావలసి ఉంది. కానీ కొన్ని అనివార్యకారణాల వలన రేపటి సమావేశం వాయిదా పడింది. మళ్ళీ మార్చి 9వ తేదీన ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఏపి సర్కార్ అధీనంలో ఉండి ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న సచివాలయం, శాసనసభ, మండలి, హైదరాబాద్ లోని కొన్ని ప్రభుత్వ కార్యాలయ భావనలను తమకు అప్పగించవలసిందిగా తెలంగాణా ప్రభుత్వం తరపున మంత్రుల కమిటీ ఏపి మంత్రుల కమిటీకి గత సమావేశంలో విజ్ఞప్తి చేసింది. అదేవిధంగా విద్యుత్ ఉద్యోగుల విభజన, షెడ్యూల్: 10 పరిధిలోని సంస్థల పంపకాలు వగైరాలపై ఏపి కమిటీ కొన్ని ప్రతిపాదనలు చేసింది. రేపటి సమావేశంలో రెండు కమిటీలు ఈ అంశాలపై తమ తమ ప్రభుత్వాల నిర్ణయాలు చెప్పవలసి ఉంది. అవన్నీ చాలా సంక్లిష్టమైనవే కావడంతో వాటిపై ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవడానికి మరికొంత సమయం అవసరం కనుకనే రేపటి సమావేశం వాయిదా పది ఉండవచ్చు. మార్చి 9న జరిగే సమావేశంలోనైనా ఈ సమస్యలకు పరిష్కారాలు కనుగొనగలిగితే మంచిదే.