భ్రూణ హత్యలు, బాల్యవివాహాలు, ఆడశిశువుల అమ్మకాలు, వెట్టిచాకిరి, మంత్రతంత్రాలు వంటి సాంఘీక దురాచారాల గురించి నేటికీ వార్తలు వినబడుతూనే ఉంటాయి. తాజాగా యదాద్రి భువనగిరి జిల్లాలో మోటకొండూర్ మండలంలో కాడేపల్లి గ్రామంలో 40 మంది గౌడకులస్తులను వారి కుటుంబాలతో సహా సాంఘిక బహిష్కరణ (వెలి) విదించబడింది. వారందరూ బెల్టు షాపుల వేలంలో తమకు సహకరించనందుకు శిక్షగా వెలి వేశారు. వారినందరినీ వెలి వేస్తున్నట్లు ఆ గ్రామ సర్పంచ్ ఏనుగు లక్ష్మి చాటింపు కూడా వేయించారు. వెలి వేయబడిన వాళ్ళందరితో గ్రామస్తులు ఎవరూ మాట్లాడకూడదని, వారితో ఎటువంటి పనులు చేయించుకోకూడదని, వారికి నీళ్ళు, ఆహారవస్తువులు ఇవ్వరాదని వారిని తాటిచెట్ల నుంచి కల్లు తీయనీయరాదని చాటింపు వేయించింది గ్రామ సర్పంచ్.
ఇటువంటి సంఘ బహిష్కరణలు ఈ ఆధునిక కాలంలో కూడా అమలవుతున్నాయంటే నమ్మశక్యంగా లేదు. కానీ జరుగుతున్నాయని ఈ సంఘటన నిరూపిస్తోంది. తమను వెలి వేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన గౌడ కులస్తులు స్థానిక పోలీస్ స్టేషన్ లో సర్పంచ్ పై పిర్యాదు చేశారు. ఆమెతో సహా ఈ నిర్ణయం తీసుకొన్నవారందరిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణా ప్రభుత్వం కూడా దోషులపై కటిన చర్యలు తీసుకోవడం చాలా అవసరం.