ఇది బిహార్ ము;ఖ్యమంత్రి కుర్చీ క్రింద లాలూ ప్రసాద్ పెడుతున్న మంటల గురించి. మొన్న ఆయన భార్య రబ్రీ దేవి మీడియాతో మాట్లాడుతూ “బీహర్ ప్రజలు నా చిన్న కొడుకు తేజస్వి యాదవ్ ను రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకొంటున్నారు,” అని ప్రకటించేసి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కుర్చీ క్రింద చిన్నగా మంట వెలిగించారు. లాలూ ప్రసాద్ యాదవ్ నిన్న మీడియాతో మాట్లాడుతూ, “ప్రస్తుతం తేజస్వీ యాదవ్ రాజకీయాలలో, పరిపాలనలో మెళకువలు నేర్చుకొంటున్నాడు. నితీష్ కుమార్ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తోంది. నేనూ, నితీష్ కుమార్ చాలా కాలం పాటు రాజకీయాలలో ఉన్నాము. కానీ ఏదో ఒకరోజున మేము తప్పుకొని యువతకు రాష్ట్ర పగ్గాలు అప్పగించవలసి ఉంటుంది కదా,” అని అన్నారు. తద్వారా మున్ముందు నితీష్ కుమార్ అధికారంలో నుంచి తప్పుకొని ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తన రెండవ కుమారుడు తేజస్వి యాదవ్ కు ప్రభుత్వ పగ్గాలు అప్పగించాలని సూచిస్తున్నట్లే ఉంది.
లాలూ సూచనపై జెడియు పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ వెంటనే స్పందిస్తూ “ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవి ఏమీ ఖాళీ లేదు. కనుక దాని గురించి ఆలోచించడం మానుకొంటే మంచిది,” అని అన్నారు. కానీ ఎప్పటికైనా కొడుకును ముఖ్యమంత్రిగా చేయాలనే ఉద్దేశ్యంతోనే లాలూ ప్రసాద్ అతనిని ఉప ముఖ్యమంత్రిగా నియమింపజేసుకొన్నారని నితీష్ కుమార్ కు కూడా తెలిసే ఉంటుంది. కేవలం 9వ క్లాసు వరకు మాత్రమే చదువుకొన్నతేజస్వి యాదవ్ బిహార్ ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పుడే అందరూ చాలా నవ్వుకొన్నారు. ఇక ముఖ్యమంత్రి కూడా అయితే రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తాడో చూడాల్సిందే .