వారి చర్చలు ఫలిస్తున్నాయా?

తెలంగాణా, ఏపి రాష్ట్రాల మద్య నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ఇరు రాష్ట్రాల మంత్రుల కమిటీలు గవర్నర్ నరసింహన్ సమక్షంలో తరచూ సమావేశమవుతున్నాయి. వారి చర్చలు ఫలిస్తున్నట్లే ఉన్నాయి. ప్రస్తుతం ఏపి సర్కార్ అధీనంలో ఉన్న హైదరాబాద్ సచివాలయంలో హెచ్, జె, కె, ఎల్ బ్లాకులను తెరాస సర్కార్ కు అప్పగించేందుకు అంగీకరించినట్లు తాజా సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం సచివాలయంలో పనిచేస్తున్న కొన్ని శాఖలు, వాటి ఉద్యోగులను హైదరాబాద్ లో వేరే చోటికి  లేదా వీలైతే వెలగపూడి సచివాలయానికి తరలించాలని ఏపి పరిపాలన విభాగం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. మరొకటిరెండు నెలలో సచివాలయ భవనాన్ని ఏపి సర్కార్ పూర్తిగా ఖాళీ చేసి అప్పగించే అవకాశాలున్నాయి. 

ఏపి సర్కార్ ఆ బ్లాకులను ఖాళీ చేస్తే సచివాలయాన్ని కూల్చివేసి దాని స్థానంలో అత్యాధునిక సౌకర్యాలతో ఒక బహుళ అంతస్తుల నూతన సచివాలయ భవనాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. అందుకు వీలుగా ఇప్పటికే సచివాలయంలో కొన్ని శాఖలను ఖాళీ చేసి వేరే చోటికి తరలించబడ్డాయి. 

ఈ సచివాలయ బ్లాకుల అప్పగింత పూర్తయితే, దాని తరువాత హైకోర్టు విభజన సమస్యను పరిష్కరించవలసి ఉంది. కానీ ఏపి సర్కార్ దానిని షెడ్యూల్: 10 పరిధిలోని సంస్థల పంపకాలతో ముడిపెట్టి బంతిని తెలంగాణా ప్రభుత్వ కోర్టులోనే పడేసింది. మరి ఈ సమస్య ఇంకా ఎప్పటిలోగా పరిష్కారం అవుతుందో చూడాలి. మంత్రుల కమిటీల చర్చలు చాలా సానుకూల వాతావరణంలోనే సాగుతున్నాయి కనుక త్వరలోనే హైకోర్టు విభజన ప్రక్రియకు కూడా ఏపి సర్కార్ అంగీకరిస్తుందనే ఆశ ఉంది. అయితే అంతకంటే ముందుగా ఏపిలో ఎక్కడో ఒక చోట తాత్కాలికంగానైనా హైకోర్టు ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. తాత్కాలిక సచివాలయం, శాసనసభ, మండలి కలిపి నిర్మించుకొన్నప్పుడు చంద్రబాబు నాయుడు తలుచుకొంటే తాత్కాలిక హైకోర్టును ఏర్పాటు చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదని చెప్పవచ్చు.