ఓట్ల కోసం లిక్కర్ పంచే ఆ సన్నాసులా?

ప్రజాధనంతో కేసీఆర్ యాజ్ఞయాగాలు చేయడం, మోక్కులు తీర్చుకోవడాన్ని తప్పుపడుతూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న కురవి భైరవస్వామి ఆలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ చాలా తీవ్రంగా స్పందించారు.

“దేవుడి మొక్కులు చెల్లించుకొంటున్నా ప్రతిపక్ష నేతలు ఏడుస్తున్నారు. తెలంగాణా ఏర్పడినందుకే మొక్కులు చెల్లించుకొంటున్నాను. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే యాగాలు చేస్తున్నాను. దేవుడిని నమ్మని కమ్యూనిస్టు నేతలు సురవరం సుధాకర్ రెడ్డి వంటి వాళ్ళు కూడా అర్ధంపర్ధం లేని విమర్శలు చేస్తున్నారు. బూజుపట్టిన కమ్యూనిస్టు సిద్దాంతాలు పట్టుకొని వ్రేలాడుతున్న వాళ్ళు, ఓట్ల రాజకీయాలు చేస్తూ దేశాన్ని రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినవాళ్ళు మాపై విమర్శలు చేస్తున్నారు. దేశంలో మరే పార్టీకి ఇవ్వనంత అవకాశం కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చారు. కానీ కాంగ్రెస్ సన్నాసులకి ఎప్పుడూ ఓట్ల గోలే తప్ప ప్రజల గోడు పట్టించుకోలేదు. ఎన్నికలు ఒస్తే ఓటర్లకు లిక్కర్ పంచి అధికారంలోకి రావడం తప్ప మీరు ప్రజల కోసం రాష్ట్రం కోసం ఏమి చేశారు? తెరాస సర్కార్ అధికారంలోకి వచ్చిన 30 నెలలోనే రాష్ట్రంలో అనేకానేక అభివృద్ధి పనులు చేపట్టింది. రాష్ట్రంలో అన్ని జిల్లాలు, అన్ని వర్గాల ప్రజలకు మేలు కలిగించే అనేక కార్యక్రమాలు మా ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టింది. ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం మేము కృషి చేస్తుంటే మీరు చేస్తున్నది ఏమిటి? కోర్టులలో కేసులు వేసి అడ్డుకొంటున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడూ ఏమీ చేయలేదు. కనీసం ప్రతిపక్షంలో కూర్చొన్నప్పుడు మమ్మల్ని ఏమీ చేయకుండా అడ్డుపడుతున్నారు. మీరు ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని అవరోధాలు సృష్టించినా రాష్ట్రాభివృద్ధి కోసం మేము చేయాలనుకొన్నవన్నీ చేసి తీరుతాము,” అని కేసీఆర్ అన్నారు.