దీప అన్నంత పనీ చేసింది

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ శుక్రవారం 69వ జయలలిత జయంతి సందర్భంగా కొత్త పార్టీ స్థాపించారు. పార్టీ పేరు ‘ఎం.జి.ఆర్.అమ్మ దీప పెరవై.’ నలుపు, ఎరుపు రంగాలతో కూడిన పార్టీ జెండా మద్యలో జయలలిత, ఎం.జి.ఆర్. చిత్రాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తానే జయలలితకు అసలైన వారసురాలినని ప్రకటించుకొన్నారు.

జయలలిత ప్రాతినిధ్యం వహించిన చెన్నైలోని ఆర్.కె. నగర్ నియోజక వర్గం నుంచి ఉప ఎన్నికలలో పోటీ చేస్తానని చెప్పారు. కొన్ని రోజుల క్రితం పన్నీర్ సెల్వంతో కలిసి పనిచేస్తానని చెప్పిన దీపా కుమార్ ఆ ఆలోచన విరమించుకొన్నట్లు చెప్పారు. పళనిస్వామి అమ్మకు, అమ్మ పార్టీకి నిజమైన ప్రతినిధి కాజాలడని దీప అన్నారు. తన రాజకీయ ప్రయాణం ఇప్పుడే మొదలయిందని, అమ్మ ఆశయాల కోసం పని చేస్తానని చెప్పారు. అమ్మను అభిమానించేవారందరికీ పార్టీలోకి స్వాగతం పలుకుతున్నానని చెప్పారు.