టిజెఎసి-తెరాస సర్కార్ మద్య యుద్ధం మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు టిజెఎసి నేతల సమావేశం అనంతరం ప్రొఫెసర్ కోదండరామ్ మీడియాతో మాట్లాడుతూ, “నిరుద్యోగర్యాలీ విఫలం అయ్యిందని తెరాస సర్కార్ చెప్పుకొంటున్నప్పటికీ మేము లేవనెత్తిన అంశంపై సర్వత్రా చాలా లోతుగా చర్చలు మొదలయ్యాయి కనుక మా ర్యాలీ నిర్వహించకపోయినా విజయవంతం అయ్యిందనే మేము భావిస్తున్నాము. విద్యార్ధులను అరెస్ట్ చేయడంపై స్వామి అగ్నివేష్ వంటి వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనుక వారిని తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని కోరుతున్నాము.
భూనిర్వాసితుల సమస్యలపై వినతిపత్రం అందించేందుకు మేము ఇదివరకే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అపాయింట్ మెంట్ కోరాము. అది ఇంకా రాలేదు. కానీ వీలైనంత త్వరలో డిల్లీ వెళ్ళి ఆయనను కలిసి ఇక్కడి సమస్యలను వివరించాలని నిర్ణయించుకొన్నాము.
ఇక సుదీర్ కమీషన్ సిఫార్సులను అమలుచేయాలని మేము తెరాస సర్కార్ ను కోరాము. కానీ ఇంతవరకు జవాబు రాలేదు. కనుక సుధీర్ కమీషన్ సిఫార్సుల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు మార్చి 1న మహబూబ్ నగర్ లో, మార్చి 4న నిజామాబాద్ లో, మార్చి 5న కరీంనగర్ లో బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించాము. కరీంనగర్ సభపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవలసి ఉంది. ప్రభుత్వం మాపై ఎన్ని ఆంక్షలు విధించినా ప్రజా సమస్యలపై మా పోరాటాలు ఆపేది లేదు,” అని అన్నారు.
టిజెఎసి నేతలు డిల్లీ వెళ్ళి తమ ప్రభుత్వంపై రాష్ట్రపతికి పిర్యాదు చేయాలనుకోవడం, ప్రొఫెసర్ కోదండరామ్ చేసిన ఈ తాజా ప్రకటనను తెరాస సర్కార్ యుద్ద ప్రకటనగానే స్వీకరిస్తుంది కనుక అది కూడా ధీటుగా స్పందించడం ఖాయం. కనుక ఇక ముందు ఇరు పక్షాల మద్య ఇదివరకు కంటే చాలా తీవ్రస్థాయిలోనే యుద్దాలు జరుగవచ్చు. ఇంతవరకు తెరాస నేతలు చాలా ఆచితూచి ప్రొఫెసర్ కోదండరామ్ పై విమర్శలు చేస్తున్నారు. కానీ నిరుద్యోగర్యాలీ పరిణామాల నేపద్యంలో ఇక అందరూ మర్యాదలు, మొహమాటాలు పక్కన పెట్టేసి ప్రొఫెసర్ కోదండరామ్ పై నేరుగానే యుద్దాలు ప్రారంభించవచ్చు.