ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం తమిళనాడులోని కోయంబత్తూరుకు రానున్నారు. అక్కడ సద్గురు జగ్గీవాసుదేవన్ నిర్వహిస్తున్న ఈశా ఆశ్రమంలో 112 అడుగుల ఎత్తుగల మహాశివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్నారు. సాయంత్రం 5గంటలకు ప్రత్యేక విమానంలో కోయంబత్తూరు చేరుకొని అక్కడి నుంచి హెలికాఫ్టర్ లో ఈశా కేంద్రానికి చేరుకొంటారు. మళ్ళీ రాత్రి 8గంటలకు బయలుదేరి కోవై విమానాశ్రయం చేరుకొని డిల్లీ తిరిగివెళతారు.
ఈ కార్యక్రమానికి తమిళనాడు ఇన్-చార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు, ముఖ్యమంత్రి పళనిస్వామి, పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడి, మహరాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫద్నవీస్, శివరాజ్ సింగ్ చౌహాన్, వసుందరా రాజే, చంద్రబాబు నాయుడు తదితరులు హాజరవుతారు.
ప్రధానితో సహా చాలా మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నందున గత వారం రోజుల నుంచే కోయంబత్తూర్ నుంచి ఈశా కేంద్రం వరకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఈశా కేంద్రంలో రాత్రంతా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి.