మహారాష్ట్ర ప్రభుత్వంలో భాజపా, శివసేన భాగస్వాములుగా ఉన్నప్పటికీ ఆ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో ఆరెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. ఈరోజు ఇంకా వెలువడుతున్న తాజా ఫలితాలలో చాలా చోట్ల ఆ రెండే ఆధిక్యత కనబరిచాయి. అయితే రెంటికీ చాలా కీలకమైన ముంబైలో మాత్రం పూర్తి మెజారిటీ సాధించలేకపోవడంతో మళ్ళీ తప్పనిసరిగా ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోవలసి ఉంటుంది.
ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బ తింది. కొన్ని చోట్ల గౌరవప్రదమైన సీట్లు సంపాదించుకొన్నప్పటికీ, ఇంతవరకు ఒక్క మున్సిపాలిటీని కూడా దక్కించుకోలేకపోయింది. ఇక శరత్ పవార్ నేతృత్వం వహిస్తున్న ఎన్.సి.పి. పరిస్థితి కూడా కాంగ్రెస్ కు భిన్నంగా లేదు. శివసేనకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని కలలు కంటున్న మహారాష్ట్ర నవనిర్మాణసేన అన్ని పార్టీల కంటే చాలా వెనుకబడిపోయింది. కానీ జిల్లా పరిషత్ కాంగ్రెస్, ఎన్.సి.పి. నవనిర్మాణసేనలు గౌరవప్రదమైన సీట్లు దక్కించుకోగలిగాయి.
ముంబై కార్పోరేషన్ లో గల 227 సీట్లలో భాజపా: 82, శివసేన: 84, కాంగ్రెస్: 31, ఎన్.సి.పి: 09, మహారాష్ట్ర నవనిర్మాణసేన: 07, ఇతరులు: 13 సీట్లు దక్కించుకొన్నాయి. కార్పోరేషన్ పీఠం దక్కించుకోవడానికి భాజపా, శివసేనలు మళ్ళీ చేతులు కలుపక తప్పదు.
పూణేలో 100, నాగపూర్ లో 70 సీట్లు గెలుచుకొని భాజపా విజయపధంలో దూసుకుపోతోంది. థానేలో శివసేన ఆధిక్యత కనబరుస్తోంది. ఉల్లాస్ నగర్, నాసిక్ లలో భాజపాకు గట్టి పోటీ ఇస్తోంది.
జిల్లా పరిషత్ ఎన్నికలలో భాజపా: 403, శివసేన: 266, కాంగ్రెస్: 303, ఎన్.సి.పి: 350, మహారాష్ట్ర నవనిర్మాణసేన:0, ఇతరులు: 148 సీట్లు దక్కించుకొన్నాయి.