పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతిలో పనిచేసే భాగ్యం దక్కడం పూర్వజన్మ సుకృతం అని చాలా మంది భావిస్తుంటారు. కానీ అందరికీ ఆ భాగ్యం దక్కదు కనుక అనేక రాష్ట్రాల నుంచి భక్తులు బృందాలుగా తిరుమలకు వచ్చి తితిదే అప్పగించిన వివిద సేవలను సంతోషంగా చేస్తుంటారు. ఇందుకు పూర్తి భిన్నమైన వార్త ఒకటి నిన్న కేసీఆర్ తిరుమల పర్యటన సందర్భంగా వినపడింది.
ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ సమైక్యరాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణాకు చెందిన సుమారు 200 మంది ఉద్యోగులు తితిదేతో సహా ఏపిలో వివిధ ఆలయాలలో పనిచేసేవారు. రాష్ట్రం విడిపోయినప్పటికీ వారందరూ ఇంకా ఆంధ్రాలోనే పనిచేయవలసి వస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్, అయన కుటుంబ సభ్యులు నిన్న తిరుమల వెంకన్న దర్శనానికి వచ్చినప్పుడు ఆ ఆలయంలో పనిచేస్తున్న తెలంగాణా ప్రాంతానికి చెందిన ఉద్యోగులు ఎంపి కవితను కలిసి తమను తెలంగాణా రాష్ట్రానికి వెనక్కు రప్పించుకోవలసిందిగా కోరుతూ ఒక వినతి పత్రం ఇచ్చారు. ఈ విషయంలో వారికి తప్పకుండా తోడ్పడతామని ఆమె హామీ ఇచ్చారు.
తిరుమల ఆంధ్రాలోనే ఉన్నప్పటికీ అక్కడ తమిళ బాష, ఆచార, వ్యవహారాల ప్రభావం చాలా బలంగా కనబడుతుంటుంది. తిరుపతి చిత్తూరు జిల్లాలో ఉంది కనుక ఆ జిల్లా యాస,బాషల ప్రభావం కూడా బాగానే కనబడుతుంటుంది. ఏపి ఉద్యోగులు ఆ పద్దతులలో సులువుగానే ఇమిడిపోగలుగుతున్నారు కానీ కాస్త భిన్నమైన యాస,బాషల కారణంగా తెలంగాణా ప్రాంత ఉద్యోగులు ఇమడలేక ఇబ్బందులు పడటం సహజమే. తిరుమలకు ధీటుగా యాదాద్రిని, భద్రాద్రి ఇంకా రాష్ట్రంలో అనేక ఆలయాలను తెరాస సర్కార్ తీర్చిదిద్దుతోంది కనుక వారిని అక్కడికి రప్పించుకోగలిగితే అందరికీ సంతోషం.