రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి నిన్న సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “ఒకప్పుడు తెలంగాణా సాధన కోసం చేసిన ఉద్యమాలతో ఇప్పుడు కోదండరామ్ చేస్తున్న ఉద్యమాలను పోల్చలేము. రెండూ ఒకటేనని అనడం సబబు కాదు. కోదండరామ్ వెనుక కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు ఉన్నారని మాకు తెలుసు. వారు మా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేకపోతున్నారు. కానీ తాము ఎంతగా పోరాడినా ప్రజలు పట్టించుకోకపోవడంతో చాలా తెలివిగా ప్రొఫెసర్ కోదండరామ్ ను ముందున ఉంచి మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారు. ఎందుకంటే ఆయనకు ప్రజలలో మంచిపేరు, గౌరవం ఉంది కనుక. కానీ అంత చదువుకొన్న కోదండరామ్ కూడా ఆ రెండు పార్టీల చేతిలో పావుగా మారి వారు ఆడించినట్లు ఆడుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. మా ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు ఇస్తూ ఇంతవరకు 30,000కు పైగా ఖాళీలు భర్తీ చేసింది. విద్యుత్ శాఖలో వేలమంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తోంది. వచ్చే రెండేళ్ళలో ఇంకా అనేక వేల ఖాళీలు భర్తీ చేయబోతోంది. మా ప్రభుత్వం ఇంత చిత్తశుద్ధిగా హామీలను నేరవేరుస్తుంటే, కోదండరామ్ నిరుద్యోగయువతను రెచ్చగొడుతూ మా ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనకు ఒకవేళ రాజకీయాలలోకి రావాలనే కోరిక ఉన్నట్లయితే నిరభ్యంతరంగా పార్టీ పెట్టుకోవచ్చు. కానీ ఈవిధంగా అడుగడుగునా రాష్ట్రాభివృద్ధికు అడ్డుతగులుతూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు చేయడం సరికాదు,” అని అన్నారు.