ఏపి సిఎం చంద్రబాబు నాయుడు మైకు పట్టుకొన్నప్పుడు తన ప్రభుత్వంలో ఎక్కడా అవినీతికి తావులేదని గట్టిగా చెపుతుంటారు. కానీ అయన మంత్రులు, పార్టీ నేతలపై మీడియాలో తరచూ ఏవో ఒక అవినీతి ఆరోపణలు కనిపిస్తూనే ఉంటాయి. వాటి గురించి చంద్రబాబు ఎన్నడూ మాట్లాడరు. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు మాట్లాడారు. మంత్రి గంటా శ్రీనివాసరావుపై అటువంటి ఆరోపణలే వచ్చాయి.
ఆయనకు, ఆయన దగ్గర బంధువులకు చెందిన కొన్ని సంస్థలు విశాఖపట్నంలోని ఇండియన్ బ్యాంక్ నుంచి 2005 లో రూ. 141.68 కోట్లు రుణం తీసుకొన్నాయి. కానీ తిరిగి చెల్లించకపోవడంతో అది వడ్డీతో కలిపి రూ.203.62 కోట్లకు చేరింది. ఎన్ని నోటీసులు పంపించినా వారి నుంచి స్పందన రాకపోవడంతో నెల రోజుల క్రితమే ఇండియన్ బ్యాంక్ వారు తనఖాపెట్టిన ఆస్తులను జప్తు చేయబోతున్నట్లు పేపర్లలో ప్రకటనలు ఇచ్చింది. అయినా వారు స్పందించకపోవడంతో వారికి చెందిన కొన్ని ఆస్తులను జప్తు చేసుకొంటున్నట్లు ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది. రంగారెడ్డి జిల్లాలో రాజేంద్ర నగర్ మండలంలో మణికొండ వద్ద సర్వే నెంబర్: 201లో గల ల్యాంకో హిల్స్ టవర్-5లో మొదటి మరియు రెండో అంతస్తులను స్వాధీనం చేసుకొంది. అలాగే తమిళనాడు కాంచీపురంలో ఒక అపార్టుమెంటులో ఫ్లాటును జప్తు చేసుకొంది.