ఏపికి ప్రత్యేకహోదా కోరుతూ అప్పుడప్పుడు బహిరంగ సభలు నిర్వహిస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ కే దానిపై క్లారిటీ లేదని ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయపడ్డారు. “ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేక పోతున్నారో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే చాలాసార్లు చెప్పినా పవన్ కళ్యాణ్ ప్రతీసభలో అది ఎందుకు ఇవ్వడం లేదు? అసలు ఇస్తారా లేదా? అని నిలదీయడం చూస్తే ఆయనకు ఈవిషయంలో అసలు క్లారిటీ లేదని స్పష్టం అవుతోంది. ప్రత్యేక హోదా కోసం విశాఖ బీచ్ లో యువకులు ధర్నా చేసేందుకు ప్రయత్నించినప్పుడు పవన్ కళ్యాణ్ వారికి సంఘీభావం ప్రకటించారే తప్ప విశాఖ వెళ్ళి వారి ధర్నాలో పాల్గొనే ప్రయత్నం చేయలేదు. పవన్ కళ్యాణ్ ప్రజల కోసమే రాజకీయాలలోకి వచ్చారనే విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానాలు లేవు. కానీ ప్రజల నమ్మకం నిలబెట్టుకోవాలంటే ప్రత్యేక హోదా కోసం ఎవరినో నిందిస్తూ కాలక్షేపం చేసే బదులు ఆయనే ధైర్యంగా ముందుకు వచ్చి పోరాటం మొదలుపెడితే అందరూ ఆయన వెంట నడుస్తారు కదా,” అని తమ్మారెడ్డి అన్నారు.