రేపు విద్యాసంస్థలు బంద్

తెలంగాణా జెఎసి ఈరోజు హైదరాబాద్ చేయతలపెట్టిన నిరుద్యోగ ర్యాలీ జరుగకుండా అడ్డుకోవడంలో తెరాస సర్కార్ విజయం సాధించగలిగింది కానీ ఆ కారణంగా ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్ధుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ ర్యాలీలో పాల్గొనడానికి బయలుదేరిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా ఒక విద్యార్ధి ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకోబోయాడు కానీ అదృష్టవశాత్తు పక్కనే ఉన్న పోలీసులు అడ్డుపడి రక్షించారు. ఈ సంఘటనతో ఉస్మానియా యూనివర్సిటీలో వాతావరణం మరింత వేడెక్కిపోయింది. ఒకప్పుడు తెలంగాణా సాధన కోసం తమ సహాయసహకారాలు కోరిన తెరాస ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత తమపైనే జులుం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ తో సహా చాలా మంది జెఎసి నేతలను, విద్యార్ధి నేతలను, యువకులను పోలీసులు అరెస్ట్ చేసినందుకు నిరసనగా రేపు హైదరాబాద్ లో విద్యాసంస్థల బంద్ కు ఓయు జెఎసి పిలుపునిచ్చింది. ప్రొఫెసర్  కోదండరామ్ తో సహా అరెస్ట్ చేసినవారినందరినీ బేషరతుగా తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.