రాష్ట్రంలో దొరల పాలన సాగుతోంది: సీపీఎం

తెలంగాణా జెఎసి తలపెట్టిన నిరుద్యోగుల ర్యాలీని తెరాస సర్కార్ అడ్డుకోవడాన్ని తెరాస నేతలు గట్టిగా సమర్ధించుకొంటున్నా, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, “టిజెఎసి తెలంగాణా కోసం చేసిన ఉద్యమాలను తీవ్రవాదం అని, అసాంఘీక చర్యలని, ఆ ఉద్యమాలను నడిపించిన తెరాసయే చెప్పడం సిగ్గుచేటు. బారీగా పోలీసులను మొహరించి తెరాస సర్కార్ ప్రజలను భయపెట్టాలనుకోగలననుకోవడం అవివేకం,” అని అన్నారు.

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట రెడ్డి మాట్లాడుతూ “ఇప్పుడు తెరాస సర్కార్ వ్యవహరిస్తున్న విధంగానే గత పాలకులు కూడా వ్యవహరించి ఉండి ఉంటే తెలంగాణా రాష్ట్ర సాధన సాధ్యం అయ్యేదా? ప్రస్తుతం రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జన్సీ సాగుతోంది. అందుకే తెరాస సర్కార్ టిజెఎసి తలపెట్టిన నిరుద్యోగుల ర్యాలీని అడ్డుకొంటోంది. ఇది చలా దుర్మార్గ చర్య,” అని అన్నారు.

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నిన్న ఖమ్మం జిల్లాలో కూసుమంచిలో మాట్లాడుతూ, “పోరాటాల ద్వారా సాధించుకొన్న తెలంగాణా రాష్ట్రంలో ప్రస్తుతం దొరల పాలన సాగుతోంది. ప్రజాస్వామ్య విధానాలకు విరుద్దంగా సాగే ఏ ప్రభుత్వమూ ఎక్కువ కలం నిలబడలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తుంచుకోవాలి,” అని అన్నారు. 

తెరాస నేతలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వెంకటేశ్వరులు మాట్లాడుతూ, “ప్రొఫెసర్  కోదండరామ్ కు కోర్టులు, చట్టాలు, ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థలంటే గౌరవం లేదు. అందుకే తను ఏది కోరుకొంటే అది జరిగిపోవాలని కోరుకొంటున్నారు. ఉద్యోగాల భర్తీపై ఇప్పటికే ప్రజలలో, ప్రభుత్వంలో, మీడియాలో కదలిక తేగలిగానని కోదండరామ్ చెప్పుకొంటున్నప్పుడు మళ్ళీ ఈ నిరుద్యోగ ర్యాలీ నిర్వహించడం ఎందుకు? సమాచారవ్యవస్థలు బాగా అభివృద్ధి చెందినందున ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగిన అందరికీ తెలిసిపోతోంది. కనున నాగోల్ లో సభ నిర్వహించుకొంటే లోకానికి తెలియదా?అయినా నగరం మధ్యనే సభ జరుపుతామని ఎందుకు మంకుపట్టు పడుతున్నారు?” అని ప్రశ్నించారు.