తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది సేపటి క్రితమే తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొని, మొక్కులు చెల్లించుకొన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు, మంత్రులు, శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి తదితరులు కూడా ఈరోజు స్వామివారి దర్శనం చేసుకొన్నారు. ఆయన నిన్న రేణిగుంట విమానాశ్రయంలో దిగినప్పటి నుంచి అన్ని చోట్ల ఘనస్వాగతం లభిస్తూనే ఉంది. కేసీఆర్ కు స్వాగతం పలుకుతూ తిరుపతి పట్టణంలో పోస్టర్లు వెలిసాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ ఆయనకు స్వాగతం పలికారు. కేసీఆర్ బృందం తిరుమల కొండపైకి చేరుకోగానే ఆలయ ఈవో, తితిదే బోర్డు సభ్యులు, అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఈరోజు ఉదయం ఆలయ ముఖద్వారం వద్ద ప్రధాన అర్చకులు పూర్ణ కుంభంతో కేసీఆర్ కు స్వాగతం పలికారు.
అనంతఃరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ, “ఆలయ అధికారులు మాకు చాలా చక్కగా సామివారి దర్శనం చేయించారు. వెంకన్న మొక్కులు తీర్చుకొన్నాము. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని కోరుకొన్నాను,” అని చెప్పారు.
కేసీఆర్ బృందం తిరుమల నుంచి బయలుదేరి దిగువనున్న అలివేలు మంగాపురంలో అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకొంటారు.