తెలంగాణా జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ను బుధవారం తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు పలువురు జెఎసి నేతలను, ఈరోజు హైదరాబాద్ లో తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీకి వివిధ జిల్లాల నుంచి బయలుదేరుతున్న జెఎసి నేతలను కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. నిరుద్యోగుల సభ నిర్వహించ తలపెట్టిన ఇందిరాపార్క్ వద్ద బారీగా పోలీసులను మొహరించారు.
ప్రొఫెసర్ కోదండరామ్, టిజెఎసి నేతల అరెస్ట్ పై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. నిరుద్యోగులు తమ సమస్యలను చెప్పుకోవడానికి ప్రయత్నిస్తే తెరాస సర్కార్ వారిని పోలీసులతో అణచివేస్తోందనే అభిప్రాయం వినిపిస్తోంది. ప్రొఫెసర్ కోదండరామ్ నిరుద్యోగులను రెచ్చగొట్టి తెరాస సర్కార్ పై బురద జల్లెందుకే ఇలాగ చాలా మొండిగా వ్యవహరిస్తున్నారని తెరాస నేతలు వాదిస్తున్నారు. ఈ ర్యాలీ కారణంగా నగరంలో యుద్దవాతావరణం కనబడుతోంది. అందుకు బాధ్యత మీదంటే మీదేనని టిజెఎసి, తెరాస నేతలు పరస్పరం నిందించుకొంటున్నారు.