నిరుద్యోగ ర్యాలీ ఓకే గానీ..

టిజెఎసి తలపెట్టిన నిరుద్యోగ ర్యాలికి హైకోర్టు అనుమతించింది కానీ నగరు శివార్లలో గల నాగోల్ మెట్రో గ్రౌండ్స్ లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటలలోగా నిర్వహించుకోవచ్చని చెప్పడంతో, కోర్టు నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి చెందిన టిజెఎసి తన పిటిషన్ ను ఉపసంహరించుకొంది. ఎట్టి పరిస్థితులలో రేపు నగరంలోనే ర్యాలీ నిర్వహించి తీరుతామని టిజెఎసి నేతలు చెపుతున్నారు. ప్రస్తుతం వారితో టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ చర్చలు జరుపుతున్నారు. అవి ముగిసిన తరువాత తమ కార్యాచరణను ప్రకటించబోతున్నారు.

టిజెఎసికి నేరచరిత్ర ఉందని, తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని తెరాస సర్కార్ హైకోర్టుకి చెప్పడంపై ప్రొఫెసర్  కోదండరామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టిజెఎసికి నేరచరిత్ర ఉందంటే అది తెలంగాణా ఉద్యమాలలో పాల్గొన్నవారిని  అవమానించినట్లేనని అన్నారు. తాము చేసిన ప్రతీ ఉద్యమంలో కేసీఆర్ కూడా పాలుపంచుకొన్నారని గుర్తుంచుకోవాలన్నారు. ఉద్యోగాలు కావాలని అడగడమే తీవ్రవాదం అయితే తాను తీవ్రవాదినేనని అన్నారు. 

ఇక రేపటి ర్యాలీలో పాల్గొనే నిరుద్యోగ యువతకు సెంట్రల్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఎవరైనా ఈ ర్యాలీలో పాల్గొన్నట్లయితే చట్టప్రకారం వారిపై కటిన చర్యలు తీసుకొంటామని, దాని వలన వారి భవిష్యత్ దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది కనుక ఎవరూ రేపటి ర్యాలీలో పాల్గొనవద్దని హెచ్చరించారు. 

టిజెఎసి రేపు తలపెట్టిన ఈ ర్యాలీ దానికీ తెరాస సర్కార్ కు మద్య యుద్దవాతావరణం సృష్టించింది. కనుక ఈ పరిణామాల కారణంగా ప్రొఫెసర్ కోదండరామ్ రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన మరింత బలపడవచ్చు. త్వరలోనే ఆ ప్రక్రియ మొదలుపెట్టినా ఆశ్చర్యం లేదు.