కొత్త జిల్లాలకు కొత్త కార్యాలయాలు

తెలంగాణా రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన తరువాత హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలు మినహా కొత్తగా ఏర్పడిన అన్ని జిల్లా కేంద్రాలలో ఇంటిగ్రేటడ్ కలెక్టరేట్ కార్యాలయాలని నిర్మించడానికి తెలంగాణా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం కొత్త జిల్లాలలో వివిధ శాఖలకు తగిన కార్యాలయాలు లేక ఉద్యోగులు, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనుక వీలైనంత త్వరగా ఈ కార్యాలయ భవనాలను నిర్మించాలని తెలంగాణా ప్రభుత్వం భావిస్తోంది.   

ఇంటిగ్రేటడ్ కలెక్టర్ కార్యాలయం అంటే దానిలోనే జిల్లాకు చెందిన అన్ని ప్రభుత్వశాఖల కార్యాలయాలు ఉంటాయి. అన్ని కార్యాలయాలు ఒకే చోట కొలువై ఉంటాయి కనుక అధికారులు, ఉద్యోగులు, ప్రజలకు కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. సుమారు 25-30 ఎకరాల విస్తీర్ణంలో ఒక్కో భవనాన్ని సుమారు రూ.40 కోట్లు వ్యయంతో నిర్మించబోతున్నారు. వీటిలో పనిచేసే అధికారులు, ఉద్యోగులకు, పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు సకల సౌకర్యాలు ఉండేవిధంగా ఈ భవనాలను నిర్మించబోతున్నారు. ఇప్పటికే చాలా జిల్లాలలో అధికారులు వీటి కోసం భూములను గుర్తించి భూసేకరణ ప్రక్రియను ప్రారంభించారు. అదే సమయంలో తెలంగాణా ప్రభుత్వం భవనాల డిజైన్లను సిద్దం చేస్తోంది. త్వరలో ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్ లో వీటి నిర్మాణం కోసం ప్రభుత్వం నిధుల కేటాయించబోతోంది. మరొక రెండు మూడు నెలలలో డిజైన్ల ఖరారు, భూసేకరణ, టెండర్లు పిలిచి, ఖరారు చేయడం వంటి ప్రక్రియలన్నీ పూర్తయితే, వెంటనే నిర్మాణపనులు మొదలుపెట్టి ఏడాదిలోగా  ఇంటిగ్రేటడ్ కలెక్టరేట్ కార్యాలయాలని సిద్దం చేయాలని తెలంగాణా ప్రభుత్వం భావిస్తోంది.