అది కాంగ్రెస్ ఆవేదన సభే: కవిత

ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అధ్యక్షతన నిజామాబాద్ పట్టణంలో నిర్వహించిన ‘జన ఆవేదన’ సభకు ‘కాంగ్రెస్ ఆవేదన సభ’ లేదా ‘జానారెడ్డి ఆవేదన సభ’ లేదా ‘దిగ్విజయ్ ఆవేదన సభ’ అని పేరుపెట్టుకొని ఉంటే సముచితంగా ఉండేదని జిల్లా తెరాస ఎంపి కవిత అన్నారు. దేశాన్ని రాష్ట్రాన్ని పదేళ్ళపాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పడు ప్రజలను పట్టించుకోకుండా వ్యవహరించినందుకే దానిని ప్రజలు తిరస్కరించారని, అయినా దాని తీరు మార్చుకోకపోవడంతో  ఒక్కో రాష్ట్రంలో అది తన ఉనికిని కోల్పోతూ ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిపోయిందని కవిత అన్నారు. దేశం నుంచి రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగు అయ్యే సూచననలు కనిపిస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రాలో పట్టినగతే తెలంగాణా రాష్ట్రంలో కూడా పట్టవచ్చని హెచ్చరించారు. అటువంటి పరిస్థితి రాకూడదనుకొంటే కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా తమ వైఖరిని మార్చుకొని రాష్ట్రాభివృద్ధి కోసం ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సలహాలు ఈయవలసిందిగా కవిత కోరారు.