తెలంగాణా జెఎసి అధ్వర్యంలో బుదవారం హైదరాబాద్ లో నిర్వహించదలచిన నిరుద్యోగ ర్యాలికి నగర పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ప్రొఫెసర్ కోదండరామ్ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. దానిపై నిన్న విచారణ జరిగినప్పుడు, ఈ ర్యాలీలో వామపక్ష తీవ్రవాదులు, అసాంఘిక శక్తులు చేరి నగరంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందని పోలీసులకు సమాచారం అందిన కారణంగానే ర్యాలీకి అనుమతించడం లేదని పోలీసుల తరపున వాదించిన రాష్ట్ర అడ్వకేట్ జనరల్ కె.రామకృష్ణా రెడ్డి న్యాయస్థానానికి తెలిపారు. అలాగే తెలంగాణా జెఎసికి గతంలో విద్వంసాలకు పాల్పడిన చరిత్ర ఉందని కనుకనే అనుమతించడం లేదని చెప్పారు. అయినా జి.హెచ్.ఎం.సి.పరిధిలోనే వేరే ప్రాంతాలలో శలవు రోజైన ఆదివారం ర్యాలీ నిర్వహించుకొంటామంటే అభ్యంతరం లేదని చెప్పారు.
తెలంగాణా జెఎసి తరపున వాదించిన రచనారెడ్డి తన వాదనను వినిపిస్తూ, “స్వామీజీల సభలకు అనుమతులు మంజూరు చేస్తున్న తెరాస సర్కార్ నిరుద్యోగులు ర్యాలి నిర్వహించుకొంటామంటే ఎందుకు అనుమతి నిరాకరిస్తోంది?” అని ప్రశ్నించారు. ఈ నిరసన ర్యాలీని ఆదివారానికి మార్చుకోమన్న హైకోర్టు సూచనపై జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ తో మాట్లాడి తమ అభిప్రాయం చెపుతామన్నారు. ఈరోజు జెఎసి అభిప్రాయం తెలియజేసిన తరువాత, హైకోర్టు ర్యాలిని అనుమతించాలా వద్దా అనే తన నిర్ణయం ప్రకటిస్తుంది.