నేడు తిరుపతికి బయలుదేరనున్న కేసీఆర్

తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే తిరుపతి వెంకన్నకు బంగారు ఆభరణాలు చేయిస్తానని మొక్కుకొన్న కేసీఆర్ తన అర్ధాంగి, కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి రెండు ప్రత్యేక విమానాలలో మంగళవారం సాయంత్రం తిరుపతికి బయలుదేరనున్నారు. సాయంత్రం తిరుమల కొండపైకి చేరుకొని రాత్రి అక్కడే గెస్ట్ హౌస్ లో బస చేసి బుదవారం తెల్లవారుజామున వెంకన్న దర్శనం చేసుకొని కేసీఆర్ తన మొక్కులను చెల్లించుకొంటారు. 

రూ.3.72 కోట్ల ఖరీదు చేసే 14.2 కేజీల బరువుగల ఒక సాలగ్రామహారం, రూ.1.21 కోట్ల విలువైన 4.65 కేజీలు బరువు గల ఒక కంఠాభరణాన్ని రేపు స్వామివారికి సమర్పించుకొంటారు. వెంకన్న దర్శనం తరువాత కొండ క్రింద ఉన్న తిరుచానూరు అమ్మవారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని, అమ్మవారికి ముక్కుపుడకను సమర్పించుకొంటారు. అక్కడి నుండి రేణిగుంట విమానాశ్రయం చేరుకొని హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతారు. అవకాశం ఉంటే రేణిగుంట నుంచే నేరుగా విజయవాడ వచ్చి అక్కడ కనకదుర్గ అమ్మవారి దర్శనం కూడా చేసుకొని అమ్మవారి మొక్కు (ముక్కు పుడక) ను సమర్పించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.