నగదు విత్ డ్రా పరిమితి పెరిగిందోచ్!

బ్యాంకులలో సేవింగ్స్ ఖాతాదారులకు శుభవార్త. నేటి నుంచి సేవింగ్స్ ఖాతాదారులు తమ అకౌంట్లలోనుంచి వారానికి రూ.50,000 నగదు తీసుకోవచ్చు. అవసరమైతే ఈ మొత్తాన్ని ఒకేసారి కూడా తీసుకోవచ్చు. కానీ ఎటిఎంలలో మాత్రం రోజుకు రూ.10,000 మాత్రమే తీసుకోవచ్చు. మార్చి 13వ తేదీ నుంచి ఈ పరిమితిని కూడా ఎత్తివేస్తారు కనుక అప్పటి నుంచి మళ్ళీ యధాప్రకారం ప్రజలు తమకు కావలసినంత నగదును తీసుకోవచ్చు. అప్పుడు ఎటిఎంలలో పరిమితిని కూడా మళ్ళీ పెంచి యధాప్రకారం రోజుకి రూ.25-40,000 వరకు తీసుకొనేందుకు అనుమతించవచ్చు.

నేటి నుంచి  నగదు విత్ డ్రా పరిమితిని పెంచబోతున్నట్లు, మార్చి 13వ తేదీ నుంచి ఈ పరిమితిని కూడా ఎత్తివేయబోతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ గతనెల 30వ తేదీనే నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలో మార్కెట్లలో నుంచి తొలగించిన పాతనోట్ల స్థానంలో కొత్తనోట్లను ప్రవేశపెట్టడంతో బ్యాంకులలో, మార్కెట్లలో నగదు లభ్యత బాగా పెరిగింది కనుక రిజర్వ్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకొంది. నోట్ల రద్దు తరువాత సుమారు మూడు నెలల పాటు దేశప్రజలు అష్టకష్టాలు అనుభవించారు. అన్ని కష్టాలు అనుభవించిన సామాన్య ప్రజలకు ఈ నోట్ల రద్దు వలన దేశానికి, తమకు ఏమైనా ఉపయోగం కలిగిందో లేదో తెలియకపోయినా ఆ కష్టాలు మరిచిపోలేని పీడ కలలుగా ఎప్పటికీ గుర్తుండిపోతాయి.