అది కాంగ్రెస్ ఆవేదన సభ

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో నిన్న నిజామాబాద్ లో ‘జన ఆవేదన’ పేరిట ఒక బహిరంగ సభ జరిగింది. దానికి ముఖ్య అతిధిగా హాజరైన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఆ సభలో మాట్లాడుతూ “కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల కోసం తెలంగాణా ఏర్పాటు చేస్తే దాని ఫలాలను తెరాస అనుభవిస్తోంది. ఇక్కడ తెరాస సర్కార్, అక్కడ మోడీ సర్కార్ రెండూ కూడా సామాన్య ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాయి. నోట్ల రద్దు చేయడం వలన సామాన్య ప్రజలు కష్టాలు, డెబిట్, క్రెడిట్ కార్డు కంపెనీలకు, పేటిఎం వంటి కార్పోరేట్ కంపెనీలకు ఇబ్బడి ముబ్బడిగా లాభాలు కల్పించింది. తెరాస సర్కార్ కూడా ఎన్నికల హామీలను అమలుచేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోంది. ముస్లింల సంక్షేమాన్ని పట్టించుకోకుండా తెరాస సర్కార్ కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ మాత్రమే సామాన్య ప్రజల కోసం ఆలోచిస్తుంది..పనిచేస్తుంది కనుక వచ్చే ఎన్నికలలో మా పార్టీకే ఓటు వేసి గెలిపించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు,” అని అన్నారు. 

కాంగ్రెస్ మార్క్ పాలన ఏవిధంగా ఉంటుందో ప్రజలు చాలా దశాబ్దాల పాటు చూశారు. అది నచ్చకనే దానిని తిరస్కరించారు. మళ్ళీ అధికారంలోకి రావడమే దాని ఏకైక లక్ష్యం కానీ ఆ సూచనలు కనిపించకపోవడంతో ఈ ఆవేదన సభ పెట్టుకొన్నట్లుంది. కాంగ్రెస్ నేతలు తమ ఆవేదనను ప్రజల ఆవేదనగా చెప్పుకొంటున్నందున ఈ సభకు ‘జన ఆవేదన’ కు బదులు ‘కాంగ్రెస్ ఆవేదన’ అని పెట్టి ఉండి ఉంటే బాగుండేది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ప్రజల ఆవేదనను గుర్తించి ఉండి ఉంటే రాష్ట్రం ఏర్పాటు చేయడానికి 10 ఏళ్ళు ఆలోచించించేదే కాదు. వందలాది మంది యువత బలిదానాలు చేసుకొంటున్నా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చొనే కాదు కదా.