తెలంగాణాలో ఇప్పుడు చాలా మంది ఔత్సాహిక దర్శకులు, నిర్మాతలు, నటీనటులు షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నారు. వారికి మరింత ప్రోత్సాహం కల్పించేందుకు తెలంగాణా రాష్ట్ర సాంస్కృతిక శాఖ మరియు కరీంనగర్ జిల్లా ఫిలిం సొసైటీ కలిసి ఫిబ్రవరి 18-22 వరకు 5 రోజుల పాటు షార్ట్ ఫిలిం ఫెస్టివల్స్ నిర్వహించబోతున్నాయి. కరీంనగర్ పట్టణంలో గల ఫిలింభవన్ లో ఫిబ్రవరి 18 సాయంత్రం 6.30 గంటలకు ఇవి ప్రారంభం అవుతాయి.
మొదటిరోజున “శతాబ్ది చిత్రం”,”దేశభక్తి సినిమాలు” అనే రెండు డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిమ్స్ ను ప్రదర్శిస్తారు. ఈ ఐదు రోజుల చిత్రోత్సవాలలో మొత్తం 12 సినిమాలు ప్రదర్శిస్తారు. వాటిలో తెలంగాణా రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిభింబించే ఒగ్గు కధ, పేరిణి నాట్యం వంటి అంశాల ఆధారంగా తీయబడిన చిత్రాలతో బాటు ఇంద్రజాల ప్రదర్శనలో తెలంగాణా రాష్ట్రానికి చెందినవారికి సంబంధించి ‘సాధన శూరులు’ పేరిట మరొక చిత్రం ప్రదర్శించబడుతుంది. ఇవి కాక వివిధ కధాంశాలతో తీసిన షార్ట్ ఫిలిమ్స్ కూడా ప్రదర్శించబడతాయి.
ఈ చిత్రోత్సవాలను కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ ప్రారంభిస్తారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, తెలంగాణా భాష మరియు సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదిరులు హాజరుకాబోతున్నారు.
ఈ ప్రయోగం విజయవంతం అయ్యి రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కూడా ఇటువంటి ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లయితే, ఈ రంగంలో ప్రవేశించాలనుకొంటున్న యువతకి, ఇప్పటికే ఈ రంగంలో తమ ప్రతిభ చాటుకొంటున్నవారికి మంచి ప్రోత్సాహం ఇచ్చినట్లవుతుంది. ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, విమానాశ్రయాలు, షాపింగ్ మాల్స్ వంటి బహిరంగ ప్రదేశాలలో వీటిని ప్రదర్శించగలిగితే తక్కువ కాలంలో అవి ఎక్కువ మందికి చేరుతాయి కనుక ఔత్సాహికులకు మంచి గుర్తింపు లభిస్తుంది కదా?