మార్చి 11న తెలంగాణా బడ్జెట్?

తెలంగాణా శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చి 8 నుంచి మార్చి 26 వరకు జరుగబోతున్నట్లు సమాచారం. కనుక మార్చి 10 లేదా 11న ఉభయసభలలో 2017-18 వార్షిక ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తెరాస సర్కార్ కూడా కేంద్ర బడ్జెట్ పద్దతిలోనే ఈసారి రాష్ట్ర బడ్జెట్ లో ప్రణాళికా వ్యయం, ప్రణాళికేతర వ్యయాలను తొలగిస్తోంది. అలాగే బడ్జెట్ ను క్యాపిటల్ (పెట్టుబడి), రెవెన్యూ (ఆదాయం) అనే రెండు పద్దులుగా చూపబోతున్నట్లు తెలుస్తోంది. కొత్తగా ప్రగతి పద్దు, నిర్వహణ పద్దు అనే రెండు పద్దులను ప్రవేశపెట్టబోతోంది. గత ఆర్ధిక సం.లో ప్రవేశపెట్టిన బడ్జెట్ రూ.1.3 లక్షల కోట్లుకాగా ఈసారి అది మరో 0.15 లక్షల కోట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రగతి పద్దులో ఎస్సీ, ఎస్టీ, విద్యా, వైద్యం, ఆరోగ్యం, సంక్షేమ రంగాలకు బారీగా నిధులు కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ను కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సంబంధిత శాఖల అధికారులు, మంత్రులు చర్చించి బడ్జెట్ కి మెరుగులు దిద్దుతున్నారు. మార్చి 1,2 తేదీలలోగా దానిని ముఖ్యమంత్రి కేసీఆర్ కి సమర్పించి, ఆయన సూచనల మేరకు అవసరమైన మార్పులు చేసి మార్చి 4,5 తెదీలలోగా బడ్జెట్ ను సిద్దం చేయవచ్చు.