చేనేతను ఆదుకొంటాం: కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం ప్రగతి భవన్ లో మరమగ్గాల కార్మికులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారి అవసరాలు, సమస్యల గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకొన్నారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా రాష్ట్రంలో చేనేత, మరమగ్గాల పరిశ్రమల అభివృద్ధికి, వాటి కార్మికుల పరిస్థితి మెరుగుపరచడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించి, ఈ బడ్జెట్ లోనే చేనేత, మరమగ్గాల పరిశ్రమలకు కేటాయింపులు చేస్తామని కేసీఆర్ వారికి హామీ ఇచ్చారు. వరంగల్లో కాకతీయ టెక్స్ టైల్ పార్క్, సిరిసిల్లాలో అపేరెల్ పార్క్ లను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. కాకతీయ టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని, అది ఏర్పడితే రాష్ట్రంలో నేత కార్మికులందరి జీవితాలలో వెలుగులు నిండుతాయని కేసీఆర్ అన్నారు. చేనేత లేదా మరమగ్గాలపై పనిచేసే ప్రతీ కార్మికుడికి నెలకు కనీసం రూ.15,000 ఆదాయం పొందేవిధంగా ప్రణాళికలు సిద్దం చేసి అమలుచేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. చేనేతను ఆదుకొనేందుకే తెలంగాణా ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు మొదలైనవాటి కోసం చేనేత వస్త్రాలను కొంటోందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. చేనేత, మరమగ్గాల కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని అన్నారు.