పవన్ కళ్యాణ్ సోమవారం గుంటూరులో జరుగబోయే ‘చేనేత ఘర్జన సభ’లో పాల్గొనబోతున్నారు. నటి సమంత తెలంగాణాలో చేనేత పరిశ్రమకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుంటే, పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. చేనేత కార్మికుల మీద అభిమానంతోనే ఇద్దరూ స్వచ్చందంగానే ముందుకు వచ్చారు.
ఇదివరకు పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానంలో పర్యటించి అక్కడ చిరకాలంగా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నవారిని పరామర్శించారు. జనసేన పార్టీ తరపున ఒక వైద్య బృందాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా కిడ్నీ బాధితులకు తక్షణమే ప్రభుత్వం వైద్యసహాయం అందించాలని లేకుంటే ఉద్యమిస్తానని గట్టిగా హెచ్చరించడంతో ఏపి సర్కార్ తక్షణమే స్పందించి వారి కోసం అవసరమైన ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టింది.
బహుశః అది చూసే చేనేత కార్మికులు కూడా తమ సమస్యల పరిష్కారానికి పవన్ కళ్యాణ్ న్ని ఆశ్రయించినట్లున్నారు. వారి ప్రతినిధులు కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ వచ్చి తమ దుస్థితి, సమస్యల గురించి పవన్ కళ్యాణ్ కు వివరించి ఆయన సహాయం అర్ధించారు. పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించి గుంటూరులో జరుగబోయే ఈ చేనేత సభకు హాజరయ్యేందుకు అంగీకరించారు. ఈ సభకు చేనేత కార్మికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు బారీ సంఖ్యలో హాజరు కాబోతున్నారు.
రాష్ట్రంలో ఒక్క రంగానికి ఒక్కో మంత్రిత్వ శాఖ, దానికి మంత్రులు, అధికారులు, వందల మంది ఉద్యోగులు ఉంటారు. చేనేతకు కూడా చాలా మందే ఉన్నారు కానీ చేనేత కార్మికుల కష్టాలు పట్టించుకొనే నాధుడు లేకపోవడంతో వారు పవన్ కళ్యాణ్ న్ను ఆశ్రయించారు. పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు, హెచ్చరికలు చేయడం అప్పుడు ఏపి సర్కార్ స్పందించి హడావుడిగా చర్యలు చేపట్టడం పరిపాటిగా మారిపోయింది. ప్రజా సమస్యలపై ఎవరో ఒకరు ఈవిధంగా వేలెత్తి చూపించి విమర్శించేవరకు వేచి చూసే బదులు ఆపనేదో ముందే చేస్తే ప్రభుత్వానికి కూడా గౌరవంగా ఉంటుంది కదా?