పళనిస్వామికే ఎమ్మెల్యేలు జిందాబాద్

తమిళనాడు శాసనసభలో ఈరోజు జరిగిన బలపరీక్షలో ముఖ్యమంత్రి పళనిస్వామి నెగ్గినట్లు స్పీకర్ ధన్ రాజ్ ప్రకటించారు. పళనిస్వామి ప్రభుత్వానికి అనుకూలంగా 122 మంది వ్యతిరేకంగా 11 మంది ఓట్లు పడినట్లు స్పీకర్ ప్రకటించారు. పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పిన డిఎంకె, కాంగ్రెస్ పార్టీలు రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ నిర్వహించాలని పట్టుబడుతూ సభలో చాలా హడావుడి చేసి, స్పీకర్ చేత బహిష్కరణ వేటు వేయించుకొని ఓటు వేయకుండానే బయటపడ్డాయి. 

పన్నీర్ సెల్వం, ఆయనకు మద్దతు ఇస్తున్న 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ప్రతిపక్షాలను బయటకు పంపించివేసి బలపరీక్ష చేసుకోవడం ద్వారా పళనిస్వామి చాలా అలవోకగా నెగ్గగలిగారు.

నిజానికి ఈరోజు శాసనసభలో జరిగిన ఈ బలపరీక్షతో డి.ఎంకె పార్టీకి అసలు సంబంధమే లేదు. అది కేవలం పన్నీర్ సెల్వం, పళనిస్వామిలకు మాత్రమే జీవన్మరణ సమస్య వంటింది. కానీ వారి మద్యలో డి.ఎంకె సభ్యులు దూరి అనవసరమైన హడావుడి చాలా చేశారు. అంతటితో ఆగకుండా స్టాలిన్ నేతృత్వంలో వారు గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసి శాసనసభలో జరిగిన అప్రజాస్వామిక పరిణామాలను వివరించి, స్పీకర్ ధన్ రాజ్ పై పిర్యాదు చేశారు. అనంతరం మెరీనా బీచ్ లో దీక్షకు కూర్చొన్నారు. 

ఈరోజు బలపరీక్షలో పళనిస్వామి విజయం సాధించినప్పటికీ ఇల్లలకగానే పండుగ కాదని చెప్పవచ్చు. మున్ముందు ఎప్పుడైనా కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వంవైపు ఫిరాయించినట్లయితే ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. మంత్రిపదవులు ఆశించి భంగపడినవారు ఆ అసంతృప్తితో ఎప్పుడైనా గోడ దూకేయవచ్చు. కనుక పళనిస్వామికి దినదిన గండమేనని చెప్పవచ్చు.