ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో 3వ దశ పోలింగ్ ఆదివారం జరుగబోతోంది. ఈదశలో 12 జిల్లాలలో గల 69 స్థానాలకు మొత్తం 826 అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. ఈ 69 నియోజక వర్గాలలో మొత్తం 2.4 కోట్లు మంది ఓటర్లున్నారు. వారిలో 1.31 కోట్లు మంది పురుషులు, 1.10 కోట్లు మంది మహిళలు, 1,026 మంది నపుంసక ఓటర్లున్నారు. ఈ మూడో దశ పోలింగ్ కోసం 25,603 పోలింగ్ స్టేషన్లను, 16,671 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
అఖిలేష్ యాదవ్ మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్న అనేకమంది రేపు జరుగబోయే ఎన్నికలలో పోటీ పడుతున్నారు. వారిలో అఖిలేష్ యాదవ్ ను చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అతని చిన్నాన్న శివపాల్ యాదవ్ కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇటావా నియోజకవర్గం నుంచి అత్యధికంగా 21 మంది పోటీ చేస్తుండగా, హైదర్ ఘర్ నియోజక వర్గం నుంచి కేవలం ముగ్గురు మాత్రమే పోటీ చేస్తున్నారు. ఈసారి ఎన్నికలలో అఖిలేష్ యాదవ్ పోటీ చేయకపోవడమే అతిపెద్ద విశేషంగా చెప్పవచ్చు. తమ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యి ముఖ్యమంత్రి పదవి చేపడతానని అఖిలేష్ యాదవ్ ముందే ప్రకటించారు.
ఉత్తరప్రదేశ్ లో మళ్ళీ ఫిబ్రవరి 23న 53 స్థానాలకు, ఫిబ్రవరి 27న 49స్థానాలకు, చివరిగా మార్చి 8న 40 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. మార్చి 11న ఓట్ల లెక్కింపు చేసి అదే రోజున ఫలితాలు వెల్లడిస్తారు.