తెలంగాణా ప్రభుత్వం అభ్యర్ధన మేరకు కేంద్రప్రభుత్వం త్వరలోనే రాష్ట్రానికి రూ. 75.6 కోట్లు విడుదల చేయడానికి అంగీకరించింది. దానితో రాష్ట్రంలో ముస్లిం విద్యార్ధుల కోసం ఏడు గురుకుల పాఠశాలలు నిర్మిస్తుంది. ఈ పాఠశాలల కోసం కేంద్రరాష్ట్రప్రభుత్వాలు 60:40 నిష్ప త్తిలో నిధులు కేటాయిస్తాయి. కనుక రాష్ట్ర ప్రభుత్వం కూడా తనవాటాగా రూ.50.4 కోట్లు కేటాయించబోతోంది. దీనిలో ఒక్కో పాఠశాల నిర్మాణానికి రూ.18 కోట్లు చొప్పున కేటాయించబడుతుందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ప్రధానకార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ మీడియాకు తెలిపారు.
ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే తెరాస సర్కార్ ఆలోచనను భాజపా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ముస్లిం విద్యార్ధులకు పాఠశాలలు నిర్మించడానికి ఏమాత్రం సంకోచించకుండా తక్షణమే నిధులు మంజూరు చేయడం విశేషం. హజ్ యాత్రకు ముస్లింలకు కేంద్రప్రభుత్వం ఇస్తున్న రాయితీని రద్దు చేసి దానిని ముస్లిం విద్యార్ధుల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ఏర్పాటుకు, వారి చదువుల కోసం ఖర్చు చేయాలని మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన విజ్ఞప్తి పట్ల కూడా కేంద్రప్రభుత్వం వెంటనే సానుకూలంగా స్పందించి దాని అమలుకు ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్రప్రభుత్వం యొక్క ఈ రెండు నిర్ణయాలను గమనించినట్లయితే, ముస్లింలకు రాయితీలు, రిజర్వేషన్లు అందించడం కంటే వారికి విద్యావకాశాలు కల్పించడానికే ఎక్కువ మొగ్గు చూపుతోందని అర్ధం అవుతోంది. కనుక తెరాస సర్కార్ కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలను పక్కన పెట్టి, ముస్లింలకు నిజంగా మేలు కలిగించే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. దాని వలన కూడా తెరాసకు తప్పకుండా వారి మద్దతు లభిస్తుంది.