తమిళనాడు శాసనసభలో హైడ్రామా

తమిళనాడు ముఖ్యమంత్రి పళణిస్వామి ప్రభుత్వం ఈరోజు శాసనసభలో బలపరీక్షను ఎదుర్కొంటోంది. ఈ సందర్భంగా సభలో చాలా రభస జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గం, డిఎంకె, కాంగ్రెస్ పార్టీ సభ్యులు శాసనసభలో రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరుపాలని పట్టుబడుతున్నప్పటికీ స్పీకర్ ధనపాల్ తిరస్కరించడంతో వారు ఓటింగ్ జరుగకుండా అడ్డుపడుతున్నారు. వారు ఆందోళనలు మధ్యనే స్పీకర్ ఓటింగ్ చేప్పట్టి మొదటి బ్లాకులో పళణిస్వామికి అనుకూలంగా 38 ఓట్లు వచ్చినట్లు ప్రకటించారు.

తమ అభ్యంతరాలను ఖాతరు చేయకుండా స్పీకర్ ఓటింగ్ కొనసాగిస్తుండటంతో డిఎంకె సభ్యులు రెచ్చిపోయారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేస్తూ ఆయనపైకి పేపర్లు విసురుతున్నారు. ఒక సభ్యుడు ఆయనపైకి విరిగిన కుర్చీని విసరడంతో సభలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఆ పరిస్థితులలో ఓటింగ్ నిర్వహించడం సాధ్యం కాదని భావిచిన స్పీకర్ సభను మధ్యాహ్నం ఒంటి గంటకు వాయిదా వేశారు. పన్నీర్ సెల్వం వర్గం ఎమ్మెల్యేలు ఎలాగయినా పళణిస్వామికి మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవాలని ప్రయత్నాలు చేస్తునందున ప్రస్తుతం శాసనసభ ప్రాంగణంలో తీవ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి.