ఆయనకి ఆ ఆలోచన కలిగిస్తున్నది ఎవరు?

తెలంగాణా జర్నలిస్టుల సంఘం (టి.జె.యు) హైదరాబాద్ లో నిన్న నిర్వహించిన మీట్ ది ప్రెస్ సమావేశంలో టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ, “ఉద్యోగాల భర్తీ గురించి తెరాస సర్కార్ చెపుతున్న లెక్కలకి వాస్తవానికి మద్య ఎక్కడా పోనతన లేదు.  ప్రభుత్వంలో వివిధ శాఖలలో కలిపి సుమారు లక్షన్నరకు పైగా ఖాళీలు ఉండగా తెరాస సర్కార్ ఇంతవరకు 5-6 వేలు కంటే ఎక్కువ ఖాళీలు భర్తీ చేయలేదు. ఈవిషయంలో తెరాస సర్కార్ కు నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఉద్యోగాల భర్తీ కోసం ఒక క్యాలండర్ విడుదల చేసి దాని ప్రకారమే ప్రతీ ఏడాది భర్తీ ప్రక్రియ కొనసాగించాలని కోరుతున్నాము. ఈవిషయంలో వారిని నిలదీస్తునందుకు ప్రభుత్వంలో ఎవరికైనా నాపై ఆగ్రహం కలిగితే వారు నన్ను వ్యక్తిగతంగా విమర్శించినా అవమానించినా నేను బాధపడను కానీ మా చిత్తశుద్ధిని, పోరాటాలను శంఖించవద్దని మనవి చేస్తున్నాను. తెరాస సర్కార్ పరిపాలన తీరు చూస్తుంటే, మనం పోరాడి సాధించుకొన్న తెలంగాణా ఆశయాలకు పూర్తి భిన్నంగా సాగుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే మేము పోరాడవలసి వస్తోంది. ప్రజా సమస్యలపై పోరాడేందుకే టిజెఎసి ఉంది తప్ప ఏదో రాజకీయ ప్రయోజనాలను ఆశించి కాదు. ఒకవేళ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు రాజకీయ వేదిక అవసరమనుకొంటే నేను టిజెఎసి నుంచి బయటకు వెళ్ళిపోతాను తప్ప టిజెఎసినే రాజకీయవేదికగా మార్చే ప్రసక్తే లేదు. ఫిబ్రవరి 22న హైదరాబాద్ లో మేము తలపట్టిన నిరుద్యోగ ర్యాలీకి పోలీసుల అనుమతి కోరాము. అందుకు అనుమతిస్తారనే అనుకొంటున్నాము. ఇవ్వకుంటే ఏమి చేయాలో చర్చించుకొని నిర్ణయించుకొంటాము,” అని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు.     

ప్రొఫెసర్ కోదండరామ్ నిర్వహిస్తున్న ప్రతీ సమావేశంలోను ఆయన రాజకీయ పార్టీ ప్రస్తావన చేస్తుండటం గమనిస్తే ఏదో ఒకరోజు ఆయన పార్టీ పెట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే మొట్టమొదట ఇబ్బంది పడేది తెరాస పార్టీయేనని వేరే చెప్పనవసరం లేదు. అయితే ఆయనకు ఆ ఆలోచనలు కలిగిస్తున్నది కూడా తెరాస సర్కార్ కావడమే విశేషం.