తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే తిరుపతి వెంకన్నకు బంగారు ఆభరణాలు చేయించి ఇస్తానని కేసీఆర్ మొక్కుకొన్నారు. ఆయన కోరికను వెంకన్న తీర్చాడు కానీ కేసీఆర్ మాత్రం ఇంతవరకు ఆ మొక్కు తీర్చుకోలేకపోయారు. ఆయన ఇప్పటికి రెండుసార్లు తిరుపతి ప్రయాణం పెట్టుకొన్నారు కానీ పని ఒత్తిడితో ఆఖరు నిమిషంలో వాయిదా వేసుకోవలసి వచ్చింది. మళ్ళీ ముచ్చటగా మూడోసారి ఫిబ్రవరి 21వ తేదీన బయలుదేరేందుకు సిద్దం అవుతున్నారు. ఆ రోజు సాయంత్రం ప్రత్యేక విమానంలో తిరుపతి వెళ్ళి రాత్రి కొండపైనే బస చేసి మర్నాడు అంటే ఫిబ్రవరి 22న స్వామివారిని దర్శించుకొని మొక్కు తీర్చుకోవాలనుకొంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన గురించి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి తెరాస సర్కార్ సమాచారం పంపించింది. కనుక ఈసారి కేసీఆర్ తప్పకుండా తన మొక్కు చెల్లించుకొంటారని ఆశించవచ్చు. స్వామివారికి కేసీఆర్ రూ.5 కోట్లు విలువగల బంగారు ఆభరణాలు సమర్పించుకొంటారు. అనంతరం కొండ క్రింద ఉన్న అలివేలుమంగాపురంలో అమ్మవారిని దర్శనం చేసుకొని ముక్కుపుడక సమర్పించుకొంటారు. మళ్ళీ అదేరోజు సాయంత్రం హైదరాబాద్ తిరిగి వస్తారు.