తిరుప్పూర్ లో కేటిఆర్ బృందం

వస్త్ర పరిశ్రమ అంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేవి గుజరాత్ లోని సూరత్, తమిళనాడు లోని తిరుప్పూర్ గల పరిశ్రమలే. తెరాస సర్కార్ కూడా రాష్ట్రంలో వరంగల్ వద్ద కాకతీయ టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేయబోతున్న సంగతి తెలిసిందే. దాని ఏర్పాటు చేసే ముందు రాష్ట్ర ఐటి మరియు పరిశ్రమల శాఖా మంత్రి కేటిఆర్ అధికారులతో కలిసి గురువారం కోయంబత్తూరు, తిరుప్పూర్, పల్లాడంలలో గల వస్త్ర పరిశ్రమల తయారీ యూనిట్లను సందర్శించి వాటి పనితీరుపై అధ్యయనం చేశారు. ఆ సందర్భంగా వారు అక్కడి అధికారులతో, తిరుప్పూర్ ఎక్స్ పోర్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో మాట్లాడి వాటి ఏర్పాటులో సాధకబాధకాలు, అవసరమైన మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటింగ్ వ్యూహాలు, అభివృద్ధి చెందుతున్న తీరు మొదలైన ప్రతీ అంశం గురించి అడిగి తెలుసుకొన్నారు. తెలంగాణా ప్రభుత్వం వరంగల్లో ఏర్పాటు చేయబోతున్న కాకతీయ టెక్స్ టైల్ పార్క్, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పలు రాయితీలు, ప్రోత్సాహకాల గురించి వారికి వివరించడంతో సుమారు 10 మంది పారిశ్రామికవేత్తలు వరంగల్ లో తమ యూనిట్లను ఏర్పాటు చేయడానికి సంసిద్దత వ్యక్తం చేశారు.  పల్లాడంలోని వస్త్రపరిశ్రమల మోడల్ సిరిసిల్ల జిల్లాకు చక్కగా నప్పుతుందని భావించిన మంత్రి కేటిఆర్, అందుకోసం ప్రయత్నాలు మొదలుపెట్టవలసిందిగా అధికారులను ఆదేశించారు. 

మంత్రి కేటిఆర్ బృందం కోయంబత్తూరు పర్యటనలో స్థానిక పిఎస్ గోవిందస్వామి నాయుడు (పి.ఎస్.జి.) అనే విద్యాసంస్థతో ఒక ఒప్పంద కుదుర్చుకొంది. కాకతీయ టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటులో తెరాస సర్కార్ అవసరమైన సాంకేతిక సహాయసహకారాలు, తెలంగాణా యువతకు ఆ రంగంలో శిక్షణ, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అవసరమైన మార్గదర్శనం పి.ఎస్.జి.) అందిస్తుంది.  

తెలంగాణాలో సరైన వస్త్రపరిశ్రమలు లేనందున రాష్ట్రానికి చెందిన చాలా మంది కార్మికులు సూరత్ వెళ్ళి అక్కడ పనిచేస్తున్నారు. వరంగల్లో కాకతీయ టెక్స్ టైల్ పార్క్ ఏర్పడి ఉత్పత్తి కార్యక్రమాలు మొదలైతే, సూరత్ నుంచి వారందరూ మళ్ళీ రాష్ట్రానికి తిరిగివచ్చే అవకాశం ఉంది. అంతేకాక రాష్ట్రంలో కొత్తగా అనేకమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలంగాణా ప్రభుత్వం భావిస్తోంది. దీని వలన చేనేత రంగానికి మేలు జరిగితే మంచిదే.