తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా నేడు ప్రగతి భవన్ లో రాష్ట్రంలో వివిధ ప్రాంతాలు, వర్గాలకు చెందిన ప్రజలతో సమావేశం కానున్నారు. మొదట జర్నలిస్టులతో సమావేశం కాబోతున్నారు. ఈ సందర్భంగా తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత మరణించిన 69మంది జర్నలిస్టుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.1 లక్ష చొప్పున అందజేయబోతున్నారు. వృద్దాప్యం లేదా అనారోగ్య కారణాల చేత పనిచేయలేని స్థితిలో ఉన్న 15మంది జర్నలిస్టులకు ఒక్కొక్కరికీ రూ.50,000 చెక్కులు అందించబోతున్నారు.
మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి నెలకు రూ.3,000 చొప్పున 5సంవత్సరాల పాటు ప్రభుత్వం పెన్షన్ చెల్లిస్తుంది. వారికి 10వ తరగతి లోపు చదువుకొంటున్న పిల్లలు ఉన్నట్లయితే అదనంగా మరొక రూ.1,000 పెన్షన్ చెల్లించబోతున్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం తెరాస సర్కార్ ప్రతీ ఏటా బడ్జెట్ లో రూ.10 కోట్లు కేటాయించి అర్హులైనవారికి ఈవిధంగా ఆర్ధికసహాయం అందజేస్తోంది. త్వరలోనే జర్నలిస్టులకు శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహించాలనుకొంటోంది. దానిలో తెలంగాణా రాష్ట్ర చరిత్ర, తెలంగాణా రాష్ట్ర అవసరాలు, రాష్ట్రంలో ఉన్న వనరులు, సామాజిక కూర్పు వంటి సకల సమాచారంతో కూడిన పుస్తకాలను అచ్చు వేసి జర్నలిస్టులకు అందించాలని భావిస్తోంది.