తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయనకు ‘మైతెలంగాణా’ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధన కోసం సుమారు 6 దశాబ్దాలకు పైగా పోరాటాలు సాగాయి. కానీ కొందరు రాజకీయ నేతల స్వార్ధం కారణంగా అవి మధ్యలోనే నిలిచిపోయేవి. ఇక తెలంగాణా రాష్ట్రం ఎన్నటికీ ఏర్పడదని అందరూ ఆశలు వదిలేసుకొన్నప్పుడు, తెలంగాణా సాధనే లక్ష్యంగా కేసీఆర్ తెలంగాణా రాష్ట్ర సమితిని ప్రారంభించి మళ్ళీ మరోసారి పోరాటాన్ని ప్రారంభించారు. అప్పుడు చాలా కాలంపాటు ఆయన ఒంటరిపోరాటమే చేశారు. ఆంధ్రా పాలకుల నుంచే కాదు మన తెలంగాణా నేతల నుంచి కూడా చాలా అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్నారు. కానీ ఆయన చిత్తశుద్ధిని, పోరాట స్ఫూర్తిని ప్రజలు మాత్రం సరిగ్గానే గుర్తించారు. అందుకే వారు ఆయన వెంట సైనికులలాగ నడిచారు. ఆ కోట్లాదిమంది మహాప్రజాసైన్యంతో ఆయన ఒకేసారి ఆంధ్రా, డిల్లీ పాలకులను ఎదుర్కొంటూ సుమారు దశాబ్దకాలం పాటు అలుపెరుగని పోరాటం చేసి చివరికి తెలంగాణా రాష్ట్రం సాధించారు.
ఈ చరిత్ర అంతా అందరికీ తెలిసిందే. తెలంగాణా ఏర్పడిన తరువాత కూడా అయన మళ్ళీ మరొకసారి పోరాటాలు చేయవలసి రావడమే విచిత్రం. బంగారి తెలంగాణాను రూపొందించుకొనేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలకు ఈసారి రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలే అవరోధాలు సృష్టిస్తుండటం చాలా విచారకరం. ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కనుక వాస్తవాలను ప్రజలకు వివరించవలసిన బాధ్యత తెలంగాణా రాష్ట్రంలో మేధావులపైనే ఉంది.
సంక్షేమం, అభివృద్ధి విషయాలలో అధికార, ప్రతిపక్ష పార్టీల వాదోపవాదాలు ఏవిధంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన లక్ష్యం ‘బంగారి తెలంగాణా’ను ఏనాడూ మరిచిపోలేదు. ఏనాడూ తన లక్ష్యం నుంచి కొద్దిగా కూడా పక్కకి జరుగలేదని చెప్పవచ్చు. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో విధ్యుత్ సంక్షోభం కనబడటం లేదు. బీడు భూములకు నీళ్ళు అందుతున్నాయి. రాష్ట్రానికి పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తున్నాయి. కొత్తగా రోడ్లు నిర్మించబడుతున్నాయి. మౌలికవసతుల కల్పన పనులు జోరుగా సాగుతున్నాయి. చేనేత, వ్యవసాయం, సాగునీరు, త్రాగు నీరు, విద్యా, వైద్యం, విద్యుత్....ఇలాగ వివిధ రంగాల అభివృద్ధికి పనులు చురుకుగా సాగుతుండటం కళ్ళెదుటే కనబడుతున్నాయి.
తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన 30 నెలల స్వల్ప వ్యవధిలోనే అనేక మార్పులు స్పష్టంగా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. ఆ క్రెడిట్ పూర్తిగా ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుంది. ఎందుకంటే మంచి దూరదృష్టి, రాష్ట్రావసరాలకు తగ్గ ప్రణాళికలు రూపొందించుకోగల సామర్ద్యం, మళ్ళీ వాటిని అంతే సమర్ధంగా, చిత్తశుద్ధితో అమలుచేయగల సామర్ద్యం ఆయనకు ఉంది గనుకనే. ఆ ప్రయత్నాలలో ఎన్ని అవరోధాలు ఎదురవుతున్నా వాటిన్నిటినీ అయన చాలా సమర్ధంగా ఎదుర్కొంటూనే, అందరినీ తన లక్ష్యం వైపు నడిపిస్తున్నారు. ఆ నాయకత్వ లక్షణాలు ముఖ్యమంత్రి కేసీఆర్ లో పుష్కలంగా ఉన్నాయి కనుకనే రాష్ట్రంలో ఈ మార్పు సాధ్యం అవుతోంది. తెలంగాణా అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం అహరహం తపిస్తూ..కలలుగంటూ నిర్విరామంగా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందరి తరపున ‘మైతెలంగాణా’ అభినందనలు, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.