ప్రధాని మోడీ సగమే చెప్పారు..

ప్రధాని నరేంద్ర మోడీ యూపిలో గుర్సాయ్ గంజ్ లో జరిగిన ఎన్నికల ప్రచారసభలో 1984లో జరిగిన ఒక సంఘటన ప్రస్తావించి, అఖిలేష్ యాదవ్ ను విమర్శించారు. ఆ రోజుల్లో అతని తండ్రి ములాయం సింగ్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తునందుకు1984 మార్చి 4వ తేదీన ఆయనపై హత్య ప్రయత్నం జరిగిందని, కానీ అదృష్టవశాత్తు ఆ దాడి నుంచి ప్రాణాలతో తప్పించుకోగలిగారని చెప్పారు. ఒక ప్రముఖ కాంగ్రెస్ నేత ఆ దాడికి పాల్పడినట్లు విచారణలో తేలిందని మోడీ చెప్పారు. తన తండ్రిని హత్య చేయడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీతోనే ఇప్పుడు అఖిలేష్ యాదవ్ ఎన్నికల పొత్తులు పెట్టుకొని దాని ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో భుజాలు రాసుకొని తిరుగుతున్నారని మోడీ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నక్కజిత్తులు ప్రదర్శిస్తుంటుందని ములాయంకు తెలుసు కానీ ఆయన కొడుకుకు ఇంకా తెలిసినట్లు లేదని అన్నారు. అందుకే ములాయం కాంగ్రెస్ పార్టీతో పొత్తులు వ్యతిరేకించి ఉండవచ్చని మోడీ అన్నారు. అయితే కురుక్షేత్రంలో ధర్మరాజు అశ్వథామ హతః అని గట్టిగా అరిచి కుంజరః అని మెల్లగా పలికినట్లుగా, అదే కాంగ్రెస్ పార్టీ (యూపిఏ ప్రభుత్వానికి) అదే ములాయం సింగ్ 2009లో మద్దతు ఇచ్చిన సంగతి చెప్పలేదు. తనకు అవసరమైనంత వరకు మాత్రమే చెప్పి ప్రజలను భాజపా వైపు తిప్పుకొనే ప్రయత్నం చేశారు.