తమిళనాడు రాజకీయాలలో గత నెలరోజులుగా సాగుతున్న సస్పెన్స్ కు గవర్నర్ విద్యాసాగర్ రావు నేడు ముగింపు పలికారు. కొద్ది సేపటి క్రితం పళనిస్వామితో ఆయన సమావేశం అయిన తరువాత, ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా ఆహ్వానించారు. పళనిస్వామికి 124మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు దృవీకరించుకొన్న తరువాత గవర్నర్ ఈ నిర్ణయం తీసుకొన్నారు. శాసనసభలో బలనిరూపణకు పళనిస్వామికి రెండు వారాలు సమయం ఇచ్చినట్లు డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ దినకరన్ మీడియాకు తెలిపారు. ఈరోజు సాయంత్రం 4గంటలకు పళనిస్వామి చేత తమిళనాడు 12వ ముఖ్యమంత్రిగా గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించబోతున్నారు. దీనితో శశికళ ఓడిపోయి గెలిచినట్లు కాగా, పన్నీర్ సెల్వం గెలిచి ఓడిపోయినట్లు అయ్యింది. చాలా విచిత్రమైన విషయం ఏమిటంటే వారిద్దరికీ ముఖ్యమంత్రి పదవి చేతికి అందినట్లే అంది చేజారిపోయింది. పళనిస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం ఖాయం అయ్యింది కనుక తమిళనాడు రాజకీయ సంక్షోభం ముగిసినట్లే చెప్పవచ్చు.