ఇంతవరకు సమైక్య రాష్ట్రాన్ని పాలించిన పాలకులు అందరూ కేవలం హైదరాబాద్ నే అభివృద్ధి చేసుకొంటూపోయారు తప్ప మిగిలిన ప్రాంతాలను పెద్దగా పట్టించుకోలేదు. ఆ కారణంగా రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మారిపోయి, తీవ్ర ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. గత పాలకుల ఈ అనాలోచిత నిర్ణయాల వలన తెలంగాణాలో కూడా అన్ని జిల్లాలు పారిశ్రామిక అభివృద్ధికి నోచుకోలేదు. ఈ సమస్యను దాని విపరీత పరిణామాలను గుర్తించిన తెరాస సర్కార్, జిల్లాల పునర్విభజన తరువాత మొత్తం 31 జిల్లాలకు సమానంగా పారిశ్రామిక అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఆ ప్రయత్నంలోనే రాష్ట్ర పారిశ్రామిక మౌలికవసతుల కల్పనా సంస్థ (టి.ఎస్.ఐ.ఐ.సి.)లో ప్రస్తుతం ఉన్న 6 సైబరాబాద్, శంషాబాద్, జీడిమెట్ల, పటాన్ చెరు, వరంగల్, కరీంనగర్ జోన్లకు అధనంగా కొత్తగా ఖమ్మం, యాదాద్రి, నిజామాబాద్ అనే మూడు కొత్త జోన్లు ఏర్పాటు చేసింది. వాటితో కలిపి టి.ఎస్.ఐ.ఐ.సి.లో మొత్తం 9 జోన్లు ఏర్పడ్డాయి. ఇవి కాక, పారిశ్రామిక అభివృద్ధికి మంచి అవకాశం ఉన్న సిద్దిపేటను కేంద్రంగా ఒక సబ్ జోన్ కూడా ఏర్పాటు చేసింది. తద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక వికేంద్రీకరణకు వీలు ఏర్పడుతుంది.
పునర్వ్యవస్థీకరించిన టి.ఎస్.ఐ.ఐ.సి.లో జోన్ లు వాటి పరిధిలోకి వచ్చే జిల్లాల కూర్పు ఈవిధంగా ఉంటుంది:
1. పటాన్‌చెరు జోన్: సంగారెడ్డి, మెదక్ జిల్లాలు.
2. సైబరాబాద్ జోన్: వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాలు ఉంటాయి.
3. శంషాబాద్ జోన్: మహబూబ్‌నగర్, వనపర్తి, జోగుళాంబ-గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాలు. రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, గండిపేట, శంకర్‌పల్లి, మొయినాబాద్, చేవెళ్ల మండలాలు.
4. మేడ్చల్-సిద్దిపేట జోన్: మేడ్చల్, మల్కాజిగిరి, సిద్దిపేట జిల్లాలు.
5. వరంగల్ జోన్: వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాలు.
6. ఖమ్మం జోన్: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలు.
7. యాదాద్రి జోన్: యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్లగొండ జిల్లాలు.
8. కరీంనగర్ జోన్: కరీంనగర్, మంచిర్యాల్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్లా జిల్లాలు.
9. నిజామాబాద్ జోన్: నిజామాబాద్, అదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి జిల్లాలు.