ఎర్రవల్లి గ్రామానికి కేసీఆర్ సర్పంచ్?

పార్టీ ఫిరాయింపులతో చాలా డీలా పడిపోయిన తెలంగాణా తెదేపా నేతలు మళ్ళీ బలం కూడగట్టుకొని తెరాస సర్కార్ పై యుద్ధానికి సిద్దం అయినట్లున్నారు. బుధవారం సిద్ధిపేట జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిద్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో ప్రజాపోరు పేరిట ఒక బారీ బహిరంగసభ నిర్వహించారు. దానికి తెలంగాణా తెదేపా నేతలందరూ హాజరయ్యి తెరాస సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. 

ఎన్నికల సమయంలో కేసీఆర్ ప్రజలకిచ్చిన హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చకుండా ప్రజలకు మాయమాటలు చెపుతూ మభ్యపెడుతున్నారని విమర్శించారు. తెరాస సర్కార్ అధికారంలోకి వస్తే దళిత కుటుంబాలకు 3ఎకరాల పొలం ఇస్తానని హామీ ఇచ్చారని, ఈ రెండున్నరేళ్ళలో ఎంతమందికి ఎన్ని ఎకరాలు భూమి ఇచ్చారో చెప్పాలని తెదేపా నేతలు నిలదీశారు. కేసీఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిలాగ కాక ఎర్రవల్లి గ్రామానికి సర్పంచ్ లాగ మాత్రమే వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎర్రవల్లిలో కాకుండా రాష్ట్రంలో ఇంకా ఎక్కడెక్కడ, ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టించారో చెప్పాలని ప్రభుత్వానికి సవాలు విసిరారు. 

లక్షల కోట్ల బడ్జెట్లు ప్రవేశపెడుతున్నప్పటికీ కనీసం విద్యార్ధులకు సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా చెల్లించడం లేదని, మరి ఆ లక్షల కోట్లన్నీ ఎక్కడ ఖర్చుపెడుతున్నారో చెప్పాలని తెదేపా నేతలు నిలదీశారు. తెలంగాణా ఏర్పడితే లక్షల ఉద్యోగాలు వస్తాయని ఆనాడు కేసీఆర్ యువతను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని, కానీ ఇంతవరకు 10-15,000 ఉద్యోగాల భర్తీ కూడా చేయలేకపోయారని విమర్శించారు. తెరాస సర్కార్ అన్ని రంగాలలో చాలా ఘోరంగా విఫలం అయ్యిందని, అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు మాయమాటలు చెపుతూ కాలక్షేపం చేసేస్తున్నారని తెదేపా నేతలు విమర్శలు గుప్పించారు. మల్లన్నసాగర్ నిర్వాసితులు ఈ సభకు హాజరుకావలనుకొంటే వారినీ పోలీసులు అడ్డుకొన్నారని తెదేపా నేతలు ఆరోపించారు. తెరాస సర్కార్ వైఫల్యాలపై ముఖ్యమంత్రి ఇలాఖాలోనే తెరాస సర్కార్ తో బహిరంగ చర్చకు సిద్దమని రేవంత్ రెడ్డి సవాలు విసిరారు.