అన్నాడిఎంకె పార్టీ పగ్గాలను శశికళ చాలా చాకచక్యంగా, అవలీలగా చేజిక్కించుకోగలిగారు కానీ ముఖ్యమంత్రి కావాలనే ఆమె ఆరాటం బెడిసికొట్టి ఊహించనివిధంగా జైలుకు వెళ్ళవలసిన దుస్థితి కల్పించింది. అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు ఆమెను దోషిగా నిర్ధారించి పోలీసులకు లొంగిపోవలసిందిగా ఆదేశించిన సంగతి తెలిసిందే. కానీ ఆమె చివరి ప్రయత్నంగా ఆరోగ్యకారణాల చేత తనకు 4 వారాలు గడువు కావాలని ఈరోజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించారు. కానీ సుప్రీంకోర్టు దానిని తిరస్కరించి తక్షణమే పోలీసులకు లొంగిపోవలసిందిగా ఆదేశించింది. ఇక తప్పనిసరి పరిస్థితులలో ఆమె బెంగళూరులో కోర్టుకు లొంగిపోయేందుకు కొద్ది సేపటి క్రితం రోడ్డు మార్గాన్న బయలుదేరారు. మార్గమధ్యలో మెరీనా బీచ్ లో జయలలిత సమాధి వద్దకు వెళ్ళి దానిపై మూడుసార్లు చేతితో చేతితో కొట్టి ఏదో శపథం చేశారు. బహుశః తనకు జరిగిన దానికి ప్రతీకారం తీర్చుకొంటానని అమ్మ సమాధిపై శపథం చేసి ఉండవచ్చని అందరూ భావిస్తున్నారు. అనంతరం అమ్మ సమాధి వద్ద కాసేపు చేతులు జోడించి మౌనంగా ఏదో ప్రార్ధించి బెంగళూరుకు బయలుదేరారు. అమ్మ సమాధి వద్ద శశికళ శపథం మీదియాలోనే బాగానే హైలైట్ అవుతోంది. అది ఆమె వర్గం ఎమ్మెల్యేలలో ఉద్వేగం కలిగించడానికి బాగా ఉపయోగపడుతోంది.
ఈరోజు సాయంత్రంలోగా శశికళ, సుధాకరన్, ఇళవరసి ముగ్గురు బెంగళూరు జైలులోకి వెళ్ళిపోయే అవకాశాలున్నాయి. ఈ కేసులో ఇదివరకే శశికళ ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించారు కనుక మిగిలిన మూడున్నరేళ్ళు గడుపవలసి ఉంటుంది. అంటే ఆమె ఆగస్ట్ 2020 నాటికి జైలు నుంచి బయటకు తిరిగి వస్తారు. అప్పటికి ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు కూడా దగ్గర పడతాయి. కానీ ఈ మూడున్నరేళ్ళలో తమిళనాడులో రాజకీయ పరిస్థితులు ఏవిధంగా మారబోతున్నాయో ఎవరూ ఊహించలేరు.