ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ లోనే ‘బస్తీమే సవాల్’ అని తెదేపా నేడు ‘ప్రజాపోరు’ నిరసన సభ నిర్వహించబోతోంది. “తెరాస సర్కార్ అధికారంలోకి వచ్చి 30 నెలలు గడిచిపోయాయి కానీ ఇంతవరకు అది తన ఎన్నికల హామీలలో ఏ ఒక్కటీ నిలబెట్టుకోలేకపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ పోకడలు ప్రదర్శిస్తూ రాష్ట్రంలో కుటుంబపాలన సాగిస్తున్నారు. ఆయన మంత్రులు అందరూ పేరుకే మంత్రులు తప్ప వారు చేయగలిగిందేమీ లేదు. అన్ని శాఖలలో కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులదే పెత్తనం. వాళ్ళే అన్నీ నిర్ణయిస్తారు. కనుక రాష్ట్ర మంత్రులు అందరూ వారి చేతిలో కీలుబొమ్మలాగా మారిపోయి, ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ప్రజల నుంచి తప్పించుకొని తిరుగుతున్నారు. ఈ 30నెలలలో వారు ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోగలిగారా?ఏమైనా పనులు చేశారా? అనే విషయం వాళ్ళే స్వయంగా ప్రజలకు చెప్పాలి. ప్రజలకు ఇచ్చిన హామీల తెరాస సర్కార్ నెరవేర్చనందుకు నిరసనగానే ఈ ప్రజాపోరు సభను కేసీఆర్ ఇలాకాలోనే నిర్వహించి ఆయన ప్రజలను మాటలతోనే ఏవిధంగా మభ్యపెడుతూ కాలక్షేపం చేసేస్తున్నారో వివరించబోతున్నాము,” అని తెదేపా తెలంగాణ అధికార ప్రతినిధి వేం నరేందర్రెడ్డి చెప్పారు.
ఈ సభకు తెలంగాణా తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, సీనియర్ నేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఉమామధవ్ రెడ్డి తెలుగు మహిళ అధ్యక్షురాలు బండ్రు శోభారాణి, మైనారిటీ విభాగం అధ్యక్షుడు తాజుద్దీన్ తదితరులు హాజరవబోతున్నట్లు సమాచారం.