తెరాస సర్కార్ హైకోర్టు ప్రశ్న

తెరాస సర్కార్ రాజకీయంగా, పాలనాపరంగా చాలా సమర్ధంగానే వ్యవహరిస్తున్నప్పటికీ, అది తీసుకొనే నిర్ణయాలకు న్యాయస్థానంలో సవాళ్ళు, ఎదురుదెబ్బలు తప్పడం లేదు. అటువంటి మరో నిర్ణయమే...ప్రభుత్వ సలహాదారుల నియామకాలు, వారందరికీ కాబినెట్ హోదా కల్పించడం. తెరాస సర్కార్ మొత్తం 18మందిని ప్రభుత్వ సలహాదారులుగా నియమించుకొని వారందరికీ క్యాబినెట్ హోదా కల్పించింది. 

పేర్వారం రాములు, బాల కిషన్, కెవి.రమణాచారి, కొప్పుల ఈశ్వర్, ఎస్.వేణుగోపాలాచారి, పిడమర్తి రవి, జి.వివేకానంద, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రామచంద్రుడు తేజావత్, దేవులపల్లి ప్రభాకర్, విద్యాసాగర్ రావు, ఎ.రామ లక్ష్మణ్, బివి పాపారావు, కెఎం సహానీ, ఏకే గోయెల్, జీఆర్.రెడ్డి, ఎస్.సత్యనారాయణ, వి.ప్రశాంత్ రెడ్డిలను ప్రభుత్వ సలహాదారులుగా నియమించుకొంది. 

తెరాస సర్కార్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ విచారణకు స్వీకరించిన హైకోర్టు, ఏ ప్రాతిపదికన అంతమందికి క్యాబినెట్ హోదాగల పదవులు కల్పించారని ప్రశ్నించింది. రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ఎమ్మెల్యేల సంఖ్యలో 15 శాతం మందికే క్యాబినెట్ హోదాకు అవకాశం ఉంది. ఆమేరకు ఇప్పటికే మంత్రివర్గం ఉంది. కనుక తెరాస సర్కార్ అధనంగా నియమించుకొన్న ఈ 18మందికి క్యాబినెట్ హోదా కల్పించడం  రాజ్యాంగ విరుద్దమని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది వాదించారు. తెరాస సర్కార్ ను దీనిపై కౌంటర్ దాఖలు చేయమని ఆదేశిస్తూ హైకోర్టు ఈకేసును 4వారాలకు వాయిదా వేసింది.