కాంగ్రెస్, భాజపా, సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీలకు చాలా కీలకమైన ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలు రేపు జరుగబోతున్నాయి. మొత్తం 7 దశలలో యూపిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 11న మొదటి దశలో 73 స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. రేపు అంటే బుదవారం 11 జిల్లాలలో గల 67స్థానాలకు ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ 67స్థానాలకు మొత్తం 720 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. మళ్ళీ వాటిలో బర్హంపూర్ (బిజ్ నోర్) నియోజకవర్గంలో అత్యధికంగా 22మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. ఈ 67నియోజకవర్గాలలో గల 2.28 కోట్లు మంది ఓటర్లు ఈ 720 మంది అభ్యర్ధులలో నుంచి 67 మందిని ఎన్నుకోవలసి ఉంటుంది.
ఉత్తరప్రదేశ్ లో ప్రస్తుతం సమాజ్ వాదీ పార్టీ అధికారంలో ఉంది. అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ ఎన్నికలకు కొన్ని రోజులు ముందు వరకు పార్టీలో అంతర్గత కలహాలతో తండ్రి, కొడుకు, చిన్నాన్నలు అందరూ కుమ్ములాడుకొని రోడ్డున పడ్డారు. చివరికి అఖిలేష్ యాదవ్ పార్టీని స్వాధీనం చేసుకోవడంతో అంతా సర్దు మణిగింది. ఆ గొడవల కారణంగా ఈసారి ఎన్నికలలో మళ్ళీ గెలుస్తుందో లేదో చెప్పలేని పరిస్థితి కనబడుతోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని భాజపా, బహుజన్ సమాజ్ వాదీ పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒకే ఒక దశలో రేపు ఎన్నికలు జరుగబోతున్నాయి. ఆ రాష్ట్రంలో మొత్తం 70 నియోజకవర్గాలే ఉన్నాయి. ఈ 70 స్థానాలకు 628మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో 75,13,547 లక్షల మంది ఓటర్లున్నారు. వారి కోసం ఎన్నికల కమీషన్ 10,854 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. గత ఏడాది ఉత్తరాఖండ్ లో ఏర్పడిన రాజకీయ సంక్షోభం గురించి అందరికీ తెలిసిందే. కనుక అక్కడ కాంగ్రెస్, భాజపాలలో ఏ పార్టీ గెలుస్తుందో ఊహించడం కష్టమే.