66 కోట్లుకి నాలుగేళ్ళయితే లక్ష కోట్లుకి ఎన్నేళ్ళు? ఇదేమి 5వ క్లాసు గణిత శాస్త్రంలోని లెక్కకాదు. వర్తమాన రాజకీయాలలో లెక్కలు. అక్రమాస్తుల కేసులో శశికళకు సుప్రీంకోర్టు జైలు శిక్ష విదించిందని తెలిసినప్పుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు “66 కోట్లుకి నాలుగేళ్ళు జైలు శిక్ష పడితే మరో లక్ష కోట్లు అక్రమాస్తులు పోగేసుకొన్నవారికి ఎన్నేళ్ళు జైలు శిక్షపడాలి? అని ప్రశ్నించారు. అది జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశ్యించి అన్నదేనని వేరే చెప్పనవసరం లేదు. ఎలాగూ అందరూ లెక్కలు వేసుకొంటున్నారు కనుక అదే లెక్కన 66 కోట్లుకి నాలుగేళ్ళు జైలు శిక్ష పడితే, ఓటుకు నోటు కేసులో రూ.50 లక్షలు ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కి లంచం ఇచ్చినందుకు ఎన్నేళ్ళు పడవచ్చు అని వైకాపా కూడా లెక్కలు అడుగవచ్చు. దానిలో ఎవరెవరు జైలుకి వెళ్ళవలసి ఉంటుందో కూడా అది చెప్పడం మరిచిపోదు.