తెరాసను విమర్శిస్తే తెలంగాణా ద్రోహులైపోతారా?

“తెరాస సర్కార్ అప్రజాస్వామిక విధానాలను ప్రశ్నిస్తే తెలంగాణా ద్రోహులైపోతారా?” అని సిపిఐ నేత కె నారాయణ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, తెరాస నేతలు తమ ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను ఎదుర్కొనేందుకు ఇదొక గొప్ప ఉపాయంగా అమలుచేస్తున్నారని నారాయణ అన్నారు. తెరాస సర్కార్ ని ఎవరు ప్రశ్నించినా, విమర్శించినా వారిపై తెలంగాణా ద్రోహులనే ముద్రవేసేస్తే సరిపోతుందన్నట్లు వ్యవహరిస్తున్నారని నారాయణ అన్నారు.

తెలంగాణా ఏర్పాటును వ్యతిరేకించిన తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వర రావు వంటి  వారికే మంత్రిపదవులు కట్టబెట్టి రాష్ట్రం కోసం పోరాటాలు చేసిన ప్రొఫెసర్  కోదండరామ్ వంటి మేధావులను తెలంగాణా ద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుండటం చాలా బాధాకరమని నారాయణ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం మాటలతోనే ప్రజలను మభ్యపెడుతూ పాలిస్తున్నారు తప్ప గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ ఇంతవరకు అమలుచేయలేకపోయారని నారాయణ విమర్శించారు. జాతీయస్థాయిలో ఎన్డీయే ప్రభుత్వంతో, రాష్ట్రా స్థాయిలో తెరాస ప్రభుత్వంతో పోరాడేందుకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ ఒకటి అవసరం ఉందని, దాని కోసం తమతో కలిసి వచ్చే పార్టీలనన్నిటినీ ఆహ్వానిస్తామని నారాయణ చెప్పారు.