తనకు జైలు శిక్ష ఖరారయిన సంగతి శశికళకు తెలియగానే, ఎడపాడి ఎమ్మెల్యే పళనిసామిని అన్నాడిఎంకె పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎంపిక చేశారు. ఆమెకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు అందరూ అయనను తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. గవర్నర్ విద్యాసాగర్ రావుకు ఈవిషయం తెలియజేస్తూ గోల్డెన్ రిసార్ట్స్ నుంచే ఫ్యాక్స్ చేశారు. పళనిసామిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించవలసిందిగా ఫ్యాక్స్ మెసేజ్ లో కోరారు. శశికళను జైలుకి తరలించిన తరువాత ఈరోజు సాయంత్రం పళనిసామి లేదా ఆయన మద్దతుదారులు గవర్నర్ విద్యాసాగర్ రావుని కలిసే అవకాశం ఉంది.
తన కలలను చిద్రం చేసిన పన్నీర్ సెల్వంపై శశికళ ప్రతీకారం తీర్చుకొంటూ ఆయనను పార్టీ ప్రాధమిక సభ్యత్వం నుంచి తొలగించారు.
సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తరువాత పన్నీర్ సెల్వం ఇకనైనా శశికళకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు అందరూ తనతో కలిసి రావలసిందిగా విజ్ఞప్తి చేశారు. పార్టీలో ఏర్పడిన ఈ తాత్కాలిక సమస్యలను, వివాదాలను మరిచిపోయి అందరూ కలిసి అమ్మ ఆశయాల కోసం పనిచేద్దామని చెప్పారు. అన్నాడిఎంకె చీల్చేందుకు ప్రతిపక్ష పార్టీ ప్రయత్నాలు చేస్తోందని, దానికి ఆ అవకాశం ఇవ్వకూడదనుకొంటే అందరూ తనతో చేతులు కలపాలని సెల్వం విజ్ఞప్తి చేశారు. శశికళకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలకు నచ్చచెప్పేందుకు సెల్వం వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, ఎంపిలు గోల్డెన్ రిసార్ట్ కు బయలుదేరారు.
శశికళను ఈరోజు సాయంత్రంలోగా జైలుకి తరలించడం ఖాయం. కోర్టు ఆదేశాలను మన్నించి ఆమె లొంగిపోతారా లేక ప్రజల సానుభూతి పొందేందుకు పోలీసులు తనను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళే వరకు ఎదురు చూస్తారా? అనేది మాత్రమే ఇంకా తెలియవలసి ఉంది.
శశికళ కేసుపై తీర్పు వచ్చేసింది కనుక ఇక గవర్నర్ విద్యాసాగర్ రావుపై మళ్ళీ ఒత్తిడి పెరుగుతుంది. కానీ మళ్ళీ పళనిసామి, పన్నీర్ సెల్వంలలో ఆయన ఎవరికి అవకాశం ఇస్తారు?ఎప్పుడు శాసనసభ సమావేశపరుస్తారు? అనేది త్వరలోనే తెలియవచ్చు.